Fraud in the pursuit of witchcraft in Chittoor district : క్షుద్రపూజలకు భయపడి సొంత బిడ్డ గొంతు కోశాడో తండ్రి. తాను చెప్పిన వారికే కూతురిని అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని.. లేకుంటే ప్రాణ నష్టం తప్పదనే స్వామీజీ మాటలతో భయపడిపోయిన భక్తుడు.. డాక్టర్ చదువుతున్న కూతురిని నరకంలోకి నెట్టేశాడు. ఇంతకీ ఈ దారుణ ఘటన ఏంటి..? ఎక్కడ జరిగింది..?
చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢభక్తితో కన్నకూతుళ్లను చంపుకున్న మదనపల్లె దారుణాన్ని మరువక ముందే.. అదే జిల్లాలో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్వామీజీ దొంగమాటలు నమ్మి కన్నకూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేశాడో కన్నతండ్రి. ప్రాణ నష్టం తప్పదని స్వామీజీ చెప్పడంతో భయపడిపోయి మెడిసిన్ చదువుతున్న కూతురి గొంతుకోశాడు. స్వామీజీ అనుచరుడికిచ్చి వివాహం జరిపించాడు.
తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటకి చెందిన వెంకట్‌రెడ్డి స్వామీజీ అవతారమెత్తాడు. తనకు సాయంగా చరణ్ అనే అనుచరుడిని పెట్టుకుని దందాలకు భక్తులకు మాయమాటలు చెప్పి మోసాలు చేసేవాడు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి స్వామీజీ వద్దకు వస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి కుటుంబంపై కన్నేసిన దొంగస్వామీజీ లేనిపోని విషయాలు చెప్పి భయపెట్టడం మొదలుపెట్టాడు. వారి కూతురిని తన అనుచరుడు చరణ్‌కిచ్చి వివాహం జరిపించాలని.. లేకుంటే ప్రాణనష్టం తప్పదంటూ తీవ్ర భయాందోళనకు గురిచేశాడు.
స్వామీజీ మాటలకు భయపడిపోయిన కృష్ణారెడ్డి మెడిసిన్ చదువుతున్న కూతురిని ఏమాత్రం ఆలోచించకుండా.. పదో తరగతి కూడా పాసవ్వని చరణ్‌కిచ్చి వివాహం జరిపించాడు. ఆమెను చేజేతులా నరక కూపంలోకి నెట్టాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి మోసం చేశాడు. అయితే రెండు నెలల తర్వాత చరణ్ అసలు రూపం బయటపడటంతో పాటు.. అదనపు కట్నం కోసం అమ్మాయిని వేధింపులకు గురిచేయడంతో మోసపోయామని గుర్తించడం బాధితుల వంతైంది.
పెళ్లైన కొద్దిరోజులకే ఆమెకు చిత్రహింసలు మొదలవ్వడం.. తమ బిడ్డ నిత్యం వేధింపులతో అల్లాడిపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. నమ్మించి మోసం చేసిన దొంగబాబా, సహా అతని అనుచరుడు చరణ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో తమదైన స్టైల్‌లో వెంకట్‌రెడ్డి ముఠా కోసం దర్యాప్తు గాలింపు ముమ్మరం చేశారు.