పేదల కోసం : ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ

  • Publish Date - July 2, 2020 / 08:40 AM IST

ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. తాజాగా..ఏడో విడత పంపిణీలో భాగంగా బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది. చక్కెరకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలోని 1.48 కోట్ల బియ్యం కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ భూతం..తెలుగు రాష్ట్రాలను చుట్టేసింది. పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. కానీ కార్మికులు, వలస కూలీలు, పేదలపై దీని ప్రభావం చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో పేదలకు ఉచితంగా సరుకులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 29వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరు విడతలుగా పేదలకు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేసింది. ఏడో విడత పంపిణీ 2020, జులై 03వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

బియ్యం కార్డులో పేర్లు నమోదైన ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. ఉచిత రేషన్‌ పంపిణీకి సంబంధించి రాష్ట్రానికి అదనంగా బియ్యం కేటాయించాలని కేంద్రానికి బుధవారం లేఖ రాసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.

Read:ఏపీ హైకోర్టులో క‌రోనా కేసులు..న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం