LPG Shortage : గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో ప్రతి సోమవారం రెస్టారెంట్లు బంద్.. జొమాటో, స్విగ్గీ ఆర్డర్లూ క్లోజ్..!

LPG Shortage : గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు మూత పడుతుండగా.. పలు హోటళ్ల యాజమాన్యాలు వారంలో ఒకరోజు హాలిడే ప్రకటిస్తున్నాయి.

LPG Shortage

  • ఏపీలో కమర్షియల్ గ్యాస్ సలిండర్ కష్టాలు
  • ఏపీ స్టార్ హోటల్స్ సంఘం కీలక నిర్ణయం
  • ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రతీ సోమవారం రెస్టారెంట్లు బంద్
  • విశాఖలో మూతపడుతున్న హోటళ్లు

LPG shortage : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత దేశంలో ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సమస్య తలెత్తుతోంది. ముఖ్యంగా ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోట్సల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి ఏపీలోనూ నెలకొంది.

Also Read : Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ డబ్బులు ఈసారి వారికి మాత్రమే.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి..

గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు మూత పడుతుండగా.. పలు హోటళ్ల యాజమాన్యాలు వారంలో ఒకరోజు హాలిడే ప్రకటిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరతతో రాష్ట్రంలోని హోటళ్ల నిర్వహణ భారంగా మారిందని ఏపీ స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో జరిగిన సంఘం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో హోటళ్లు నడపడం కష్టంగా మారిందని, దీంతో కొన్ని కఠిన నిర్ణయాలను సమావేశంలో తీసుకోవటం జరిగిందని ఆయన చెప్పారు.

హోటళ్ల నిర్వహణలో భాగంగా గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పారు. ప్రతీ సోమవారం రెస్టారెంట్లకు వీక్లీ హాలిడే ప్రకటిస్తామని చెప్పారు. కర్ణాటక తరహాలో హోటళ్లలో కేవలం టీ, కాఫీలే విక్రయించే పరిస్థితి ఏపీకి రాబోతుందని, రాత్రి 10గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తామని చెప్పారు.

గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఇప్పటికే వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని ఏపీ స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి తెలిపారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.

విశాఖలోనూ యుద్ధం ఎఫెక్ట్..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్టణంలోని హోటల్ రంగానికీ తాకింది. విశాఖ నగరంలో గత వారంరోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని హోటల్ యాజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3వేల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. విశాఖ నగరంలో చిన్న, పెద్ద హోటళ్లు కలిపి దాదాపు వెయ్యి వరకు ఉంటాయి. వీటికి ప్రతీ నెలా దాదాపు 65వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం కేవలం 45వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని తెలుస్తోంది. రాబోయే రెండుమూడు రోజుల్లో 12 నుంచి 14వేల సిలిండర్ల సరఫరా చేయగలమని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే.. రెండుమూడు రోజుల్లో విశాఖ నగరంలోని పలు హోటళ్లు మూత పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.