Anakapalli-Parawada: అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
Parawada Pharma city : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Fire Accident At Paravada Pharma City In Anakapalli District
Parawada Pharma city : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం తెల్లవారు జామున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లను వెంకటేశ్, త్రినాథ్లుగా గుర్తించారు. వీరిద్దరూ అచ్యుతాపురం వాసులుగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, విపత్తుల నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు కార్మికుల మృతిపై సంతాపం తెలిపిన ఆయన.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు.
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని వైఎస్ జగన్ కోరారు.
