Vasireddy Padma
Vasireddy Padma – Pawan Kalyan : ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30వేల మంది బాలికలు, మహిళల మిస్సింగ్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ స్పందించారు.
బాలికలు, మహిళల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్ కల్యాణ్ హడావిడి చేస్తున్నారు అని మండిపడ్డారు. మరి టాప్ టెన్ లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మహిళల అదృశ్యం లెక్కలు ఎంపీలు ఎందుకు అడగడం లేదని ఆమె ప్రశ్నించారు. ఏపీలో హిళల మిస్సింగ్ గురించి పవన్ కల్యాణ్ ఎందుకు తాపత్రయపడుతున్నారు అని నిలదీశారు. ఏపీ మీద ఎందుకు విషం చిమ్ముతున్నారు అని మండిపడ్డారు.(Vasireddy Padma)
” మీది రాజకీయపరమైన కోపమా? రాష్ట్రం మీద కోపమా? 11వ రాష్ట్రంగా ఉన్న ఏపీ మీద మాత్రమే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు? మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదు? రాజ్యసభలో కొంతమంది ఎంపీలతో ఆడిగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళల మిస్సింగ్ జరుగుతుంది అంటున్న పవన్ కల్యాణ్.. పక్కన ఉన్న తెలంగాణలో ఏ వ్యవస్థ ద్వారా మహిళల మిస్సింగ్స్ జరుగుతుందో చెప్పగలరా?
సినిమాల ద్వారా లవ్ స్టోరీలు తీస్తున్న పవన్ కల్యాణ్, ఆయన ప్రొడ్యూసర్స్ మహిళల మీద దాడులకు ప్రేరేపించడం లేదా? ఏపీలో ఆడవాళ్ళు గౌరవంగా ఉండడానికి వాలంటీర్స్ ఒక కారణం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు సంబంధించి అన్ని పథకాలను వాలంటీర్స్ ఇంటికి తీసుకెళుతున్నారు. పవన్ కల్యాణ్ దత్తపుత్రుడే కాదు, పిచ్చి పుత్రడు కూడా. పని చేస్తున్న వ్యవస్థల మీద పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు. మహిళలు సమక్షంలో రచ్చబండ పెడదాం. పవన్ కల్యాణ్ కి దమ్ముంటే రచ్చబండకి రావాలి” అని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు.
Also Read..Nandigama Constituency: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయా?
”పవన్ కు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. సీఎం జగన్ కు మహిళలను ఆదుకోవడం తెలుసు. పవన్ తీస్తున్న సినిమాల వల్లనే మహిళలు అదృశ్యం అవుతున్నారు. వాలంటీర్ల వల్ల మహిళలు అదృశ్యం అయితే.. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఏ వాలంటీర్ వ్యవస్థ ఉందని మహిళలు అదృశ్యం అయ్యారు? ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడ్డం మంచిది కాదు. పవన్ దత్తపుత్రుడు కాదు విషపుత్రుడు” అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.