శ్రీశైలం ఘంటామఠంలో బంగారు నాణేలు

  • Publish Date - October 7, 2020 / 08:07 AM IST

gold coins found in srisailam Ghantapatham : సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడుతున్నాయి. శ్రీశైలం క్షేత్రంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనుల తవ్వకాల్లో ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో బంగారు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం మాత్రమే కాకుండా.. 17 వెండి నాణేలను కూడా గుర్తించారు.



శ్రీశైలంలో బంగారు నాణేల కలకలం రేగడంతో ఆలయ అధికారులు, తహసీల్దార్, పోలీసులు ఘంటామఠం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ నాణేలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలో 2017లోనూ సరిగ్గా ఘంటామఠం వద్దే బంగారు, వెండి వస్తువులు లభించాయి. 18 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, 3 ఉంగరాలు, చిన్నపాటి బంగారు వస్తువులు, 147 వెండి నాణేలు, ఒక వెండి బేసిన్, 2 వెండి గిన్నెలు లభ్యమయ్యాయి.



సెప్టెంబర్‌ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా.. మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించి ఉన్నాయి. 97 వెండి నాణేలు విడిగా లభించగా.. 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.



శ్రీశైలం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం, పోలీసుల కన్నుగప్పి గుప్త నిధులకు సంబంధించిన తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడ్డాయని తెలియడంతో తవ్వకాల వేట మరికొంత మంది సాగించనున్నారు.