AP Govt Kiosk machines
AP Govt Kiosk machines : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ దేవాలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయాల్లో వంద కియోస్క్ లు ఏర్పాటు చేయనున్నారు. టచ్ స్క్రీన్ ఉండే వీటి ద్వారా భక్తులు దర్శనం, వివిధ సేవల టికెట్లు నేరుగా పొందొచ్చు. వీటిలో ఎన్ని టికెట్లు కావాలో నమోదు చేసి.. డిజిటల్ చెల్లింపు చేస్తే వెంటనే టికెట్లు జారీ చేస్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ కియోస్క్ మెషిన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ కొత్త కియోస్క్‌లు భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఇకపై క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా, తమకు కావాల్సిన దర్శనం, సేవల టికెట్లను నేరుగా ఈ స్క్రీన్ కియోస్క్ మెషిన్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఉద్యోగులు అవసరం లేకుండానే నేరుగా టికెట్లు పొందేలా వీలు కల్పిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆలయాల నిర్వహణపై భారం తగ్గుతుంది. అయితే, వాటి ఇన్ స్టలేషన్, నిర్వహణ బాధ్యతలను కరూర్ వైశ్యా బ్యాంకు చూసుకోనుంది.
Also Read: Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.. పదిరోజులు అందుకు అవకాశం..
ఏపీలోని ప్రధాన ఆలయాలైన విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవాలయాల్లో ఎనిమిది చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ముఖ్య ఆలయాలైన అరసవిల్లి, విశాఖ కనకమహాలక్ష్మి, తలుపులమ్మ, వాడపల్లి, పెనుగంచిప్రోలు, మోపిదేవి, పెదకాకాని, పెంచలకోన, తలకోన, ఈరన్నస్వామి, మహానంది, బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి, కసాపురం ఆంజనేయస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, బోయకొండ గంగమ్మ ఆలయాల్లో మూడేసి కియోస్క్ మెషిన్లు ఏర్పాటు చేయనున్నారు.
తిరుమలలో ఇప్పటికే కియోస్క్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. అన్నప్రసాద వితరణ కేంద్రంలో భక్తులు విరాళాలు అందజేసేందుకు ఈ కియోస్క్ మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లడ్డూ విక్రయాల కోసం కూడా కియోస్క్ మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలోని ప్రధాన, ముఖ్యమైన ఆలయాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.