Talliki Vandanam : ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. త్వరలోనే తల్లికి వందనం స్కీమ్ అమలు చేయనుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇచ్చేది ఎప్పుడో ఆయన చెప్పేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు మంత్రి నిమ్మల.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో తల్లికి వందనం స్కీమ్ పై కీలక చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే జూన్ లోగా తల్లికి వందనం అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో హామీ మేరకు ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తారు.
గత వైసీపీ సర్కార్ అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసేది. తాము అధికారంలోకి వచ్చాక ఇంట్లో స్కూల్ కి వెళ్లే విద్యార్థులు ఎంతమంది ఉన్నా వారందరికీ తల్లికి వందనం పేరుతో తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
Also Read : గుడ్ న్యూస్.. ఏపీలో రైతులకు రూ.20వేలు ఇచ్చేది ఎప్పుడంటే..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రచారం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మంత్రి నిమ్మల గ్రాడ్యుయేట్లను కోరారు.
ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం, దగా చేశారని జగన్ పై నిప్పులు చెరిగారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోకేశ్ ఆధ్వర్యంలో డీఎస్సీ విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టుల నియమకాలు పూర్తి చేస్తామన్నారు.
ఇక, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు. అలాగే ఈ మే నెల నుండి రైతుకు 20 వేలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నామన్నారు. రాజధాని అమరావతి, పోలవరం వంటి ముఖ్య ప్రాజెక్టుల పునర్ నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల వంటివి కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనలో జరిగాయన్నారు మంత్రి నిమ్మల.