Gossip Garage : రేషన్‌ బియ్యం మాఫియాకు సేనాని సెగలు..! ఆ మాజీ ఎమ్మెల్యేకు ఇత్తడైపోవడం ఖాయమా?

అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్‌ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.

Gossip Garage : ముందే చెప్పా. నాతో పెట్టుకోవద్దు..నన్ను గెలుకొద్దని. ఇప్పుడు నేను గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ సార్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాడనుకున్నారో? రాలేడనుకున్నారో తెలియదు కానీ..రాసుకో రా సాంబా అంటూ లెక్కబెట్టి కక్కించే పని మొదలుపెట్టారు. సిచ్యువేషన్ చూస్తుంటే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అన్నంత పని చేసేలా ఉన్నారు. రావడం లేటు కావొచ్చు..రావడం మాత్రం పక్కా అన్నట్లుగా ఏకంగా తానే రంగంలోకి దిగి రేషన్ బియ్యం మాఫియాకు సెగ పుట్టిస్తున్నారు. కక్కుర్తి కథేంటి పిన్ టు పిన్‌ బయటికి రావాల్సిందేనంటున్నారు సేనాని. రేషన్‌ బియ్యం మాఫియాకు ఇక చుక్కలేనా.? ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందా మటాషేనా.?

రేషన్ బియ్యం మాఫియా వెనుకున్న వారికి వార్నింగ్..
లేటు అయింది. మర్చిపోయారు. మన వరకు రారు అనుకున్నారేమో. దేనికైనా ఓ టైమ్ ఉంటుంది రాజా అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గుట్టు చప్పుడు కాకుండా..ఎవరి కంట పడకుండా..అందరినీ మ్యానేజ్‌ చేసుకుని పని కానిచ్చేద్దామంటే..సీన్‌ సితారే అంటున్నారు. ఒక్కొక్కడికి ఇత్తడైపోవడం ఖాయమంటూ ఉన్నట్లుండి సడెన్‌గా కాకినాడ పోర్టులో ప్రత్యక్షమయ్యారు సేనాని. రేషన్ బియ్యం మాఫియా వెనుకున్న మాస్టర్‌ మైండ్‌కు కూసాలు కదిలిపోయేలా యాక్షన్‌ షురూ చేశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అని గత ఐదేళ్లలో రెచ్చిపోయినోళ్లకు..పవర్‌లో నుంచి దిగిపోయినా గుట్టుచప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నోళ్లకు సెగలు కక్కిస్తున్నారు పవన్‌.

బియ్యం అక్రమంగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై సీరియస్‌..
కాకినాడలోని యాంకరేజ్‌ పోర్టు నుంచి భారీగా రేషన్‌ బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల మీద ఫైరయ్యారు పవన్‌ కల్యాణ్. ప్రజాప్రతినిధులు, నేతలు వచ్చి అక్రమ రవాణాను ఆపితే కానీ.. చర్యలు తీసుకోరా అని నిలదీశారు. రవాణాకు సిద్ధమై పట్టబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్‌ స్వయంగా వెళ్లి చూశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో బియ్యాన్ని‌ పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఈ సీరియస్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేకు సహకరిస్తున్నారన్న అనుమానంతో ఇప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కూడా మందలించారు పవన్. అక్రమ రేషన్ బియ్యం దందా వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు.

బియ్యం స్మగ్లింగ్ వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి హస్తం?
పవన్‌ కాకినాడ పోర్టుకు వెళ్లడంతో రేషన్ బియ్యం మాఫియా గుండెలు గుభేల్‌ అంటున్నాయట. ఎన్నికలకు ముందే రేషన్ బియ్యం దందా అంతు తేలుస్తామని చెప్పిన సేనాని ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. అక్రమ దందా వెనుక కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి హస్తం ఉందట. ఆయన కనుసన్నునల్లోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని చెబుతుంటారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన చేసిన బియ్యం దందా..ఆఫ్రికా దేశాలన్నింటికీ పాకిందని టాక్. రేషన్ బియ్యాన్ని కేజీ పది రూపాయలకు కొని..వాటిని స్మగ్లింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. వేల కోట్ల విలువైన బియ్యాన్ని తరలించి ఉంటారన్న చర్చ ఉంది. కాకినాడ పోర్టును తన గుప్పిట్లో పెట్టుకుని ద్వారంపూడి దందా నడిపిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి.

ఇక నుంచి ఉక్కుపాదమే అంటున్న పవన్..
అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ బియ్యం దందాపై ఫోకస్ పెట్టారు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్. కాకినాడలోనే ఉండి స్మగ్లింగ్ వ్యవహారాలను కంట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే లూప్ హోల్స్ పట్టుకుని మళ్లీ చాపకింద నీరులా దందా నడిపిస్తున్నట్లు రిపోర్ట్‌ వచ్చిందట. అంతలోపే కాకినాడ పోర్టుకు దగ్గరలో రేషన్ బియ్యం పట్టుబడటంతో పవనే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఇక నుంచి ఉక్కుపాదమే అంటున్నారు పవన్. ఎవరినీ విడిచిపెట్టేది లేదని..అధికారులు నిఘా పెట్టాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చేశారు.

పవన్‌ను ఓడించడానికి ద్వారంపూడి 100 కోట్లు ఖర్చుపెట్టారా?
రేషన్‌ బియ్యం దందా చేస్తూ వైసీపీ హయాంలో రెచ్చిపోయారని ద్వారంపూడి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఎన్నికలకు ముందు పవన్‌తో పెట్టుకున్నారు ద్వారంపూడి. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని సేనాని సవాల్‌ చేయడంతో పాటు.. తమ మీద దాడులు చేయించారని ఆగ్రహంతో ఉన్నారు జనసేన లీడర్లు, క్యాడర్. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం స్మగ్లింగ్‌ వ్యవహారం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉండొచ్చనేది పవన్ అనుమానమట. వైసీపీ పెద్దల డైరెక్షన్‌లోనే పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి ద్వారంపూడి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందుకే ఆయన అక్రమార్జన లెక్కలన్నీ బయటకు తీసి.. కటకటాల్లోకి పంపాలని జనసేన నేతలు పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే ముందుగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రంగంలోకి దింపి కొంత కంట్రోల్ చేయించారు పవన్.

ఇప్పుడు ఏకంగా తానే ఫీల్డ్‌లోకి దిగి..రేషన్ మాఫియాకు అంతర్గతంగా సహకరిస్తున్న అధికారులకు, కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో అనుకోకుండా పవన్ రూపంలో పడిన పిడుగు బియ్యం స్మగ్లింగ్‌ మాఫియాను గడగడలాడిస్తుందట. తీగ లాగితే డొంక కదలిపోతుందేమోనని..అలర్ట్ అవుతున్నారట.

 

Also Read : ఈ కేసు కాకపోతే మరొకటి.. కొడాలి నానిని మాత్రం వదిలేది లేదంటున్న కూటమి సర్కార్..!