Pawan Kalyan: ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. ఇప్పుడిదే పొలిటికల్ హాట్ టాపిక్. యాక్సిడెంటల్‌గా మాట్లాడారో..లేక మనసులో మాటను బయటపెట్టారో కానీ..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి కామెంట్స్ చుట్టూ నాలుగైదు రోజులుగా దుమారం నడుస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకోసారి సెంటిమెంట్ రచ్చ రాజుకుంటోంది. కోనసీమలో కొబ్బరి పంటకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు కాస్త లేటుగా రెస్పాండ్ కాగా..బీఆర్ఎస్ ముఖ్య నేతలెవ్వరు పవన్ కామెంట్స్ మీద పెద్దగా రెస్పాండ్ కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ల దిష్టి. పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్‌లో హీట్‌ను పెంచేస్తున్నాయి. ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్..అక్కడ దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరు పొందాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా వీటి పచ్చదనమేనని చెప్పుకొచ్చారు. కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని..ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని, అందుకే మొండెలుగా మిగిలాయని పవన్ కామెంట్ చేశారు.
అయితే పవన్ వ్యాఖ్యలను ముందు పెద్దగా పట్టించుకోని తెలంగాణ నేతలు..రెండు మూడ్రోజుల రోజుల తర్వాత స్పందించడం ఆసక్తికరంగా మారింది. మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త బుర్రపెట్టి ఆలోచించి మాట్లాడాలని పవన్ కు ఆయన హితువు పలికారు. ఆ తర్వాత క్రమంగా తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందించడం మొదలుపెట్టారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే..పవన్ కల్యాణ్ సారీ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమంటూ ఘాటుగా హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతున్నానని వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి..పవన్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు.
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కామెంట్స్ ను ఖండిస్తూ ఇది ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడే మాటలు కాదన్నారు. తెలంగాణ ప్రజలను బాధపెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు లేదా నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందన్న పొన్నం..పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి పవన్ పై సీరియస్ అయ్యారు. ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదంటూ నిలదీశారు. పవన్ క్షమాపణ చెప్పేవరకు ఆయన సినిమాలను తన నియోజకవర్గం జడ్చర్లలో ఆడనివ్వమని హెచ్చరించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పవన్ కామెంట్స్ ను తప్పుబట్టారు.
బీఆర్ఎస్ నేతల మౌనంపై చర్చ..!
ఇలా ఏపీ డిప్యూటీ సీఎంపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే పవన్ దిష్టి వ్యాఖ్యలు చేసి నాలుగైదు రోజుల తర్వాత ఎందుకు స్పందిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అందరికంటే ముందు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఆ తర్వాత మాజీమంత్రి జగదీష్ రెడ్డి పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు రియాక్ట్ అవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తెలంగాణ అనగానే సెంటిమెంట్ ను రాజేసే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు మాత్రం పవన్ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించకపోవడంపైనా చర్చ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించిన ఏ చిన్న అంశం వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే గులాబీ పార్టీ కీలక నేతలెవరూ పవన్ కామెంట్స్ పై ఎందుకు నోరు మెదపడం లేదన్న చర్చ జరుగుతోంది.
ఇక పవన్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దంటూ కోరింది. ఇంతటితో ఈ వివాదం సద్దుమణుగుతుందా? లేక పవన్ క్షమాపణలు చెప్పే వరకు కాంగ్రెస్ నేతలు పట్టుబడతారా అనేది చూడాలి.