Gossip Garage : మహానాడులోపే..! పదవుల రేసులో ఉన్న నేతలకు చంద్రబాబు గుడ్‌న్యూస్..

ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు వ‌దులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.

CM Chandrababu Naidu

Gossip Garage : అధికారంలోకి వచ్చామని హ్యాపీగా ఫీలయ్యారు. కానీ తమకు పదవులు ఎప్పుడని నిరాశలో ఉన్నారు పలువురు నేతలు. లీడర్లు, క్యాడర్ మనోగతం తెలిసిన టీడీపీ అధినేత గుడ్‌ న్యూస్‌ చెప్పేశారు. మహానాడులోపే పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పేశారు. రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి పోస్టుల వరకు అన్నింటినీ ఫిలప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆశావహుల్లో ఎమ్మెల్సీలు అయ్యేదెవరు? నామినేటెడ్ బెర్త్‌లు దక్కేదెవరికి.?

ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులు పూర్తిగా భర్తీ..
ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయింది. పవర్‌లోకి వచ్చాం సరే..పదవుల మాటేమిటని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తీపికబురు చెప్పారు సీఎం చంద్రబాబు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులు పూర్తిగా భర్తీ చేస్తామని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల బోర్డులలో నియామకాల కోసం పేర్లు ఇవ్వాలని సూచించారు. అలాగే టీడీపీ పార్టీ పదవులను మహానాడులోపు పూర్తి చేయాలని నేతలకు స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఇస్తేనే తీసుకుంటామని పట్టు..
ఇప్పటికే రెండు విడతలుగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసింది కూటమి సర్కార్. అందులో దాదాపు 80కి పైగా కీలక పదవులను నేతలకు కట్టబెట్టింది. ఇంకా 50కి పైగా కార్పొరేషన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో..ఎవరెవరికి యోగం దక్కబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : జాగ్రత్త అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్.. చంద్రబాబు వ్యూహం ఏంటి? టార్గెట్ ఎవరు?

కొందరు లీడర్లు నామినేటెడ్‌ పోస్టుల కోసం వెయిటింగ్‌ లిస్టులో ఉంటే..మరికొందరు ఎమ్మెల్సీ ఇస్తేనే తీసుకుంటామని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి తమ విజ్ఞప్తులను తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. నలుగురు వైసీపీ సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే ఇంకో ఎమ్మెల్సీ సీటు కూడా కూటమి ఖాతాలోకి రానుంది. ఇప్పుడు టీచర్, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ సీట్లలో కొందరికి అవకాశం కల్పించారు. త్వరలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ సీట్లలో ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మండలికి వెళ్లే అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చి నచ్చజెప్పాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు.

మార్చి, ఏప్రిల్ రెండు నెలల్లో ఆశావహులకు గుడ్‌న్యూస్‌ రాబోతుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపై కస‌ర‌త్తును కొలిక్కి తెచ్చిన బాబు, పవన్‌..టికెట్లు త్యాగం చేసిన వాళ్లకు..గెలుపు కోసం కష్టపడిన వాళ్లకు…వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తిన వాళ్లకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. ప్రధానంగా టీడీపీ నుంచి చాలామంది ఆశావ‌హులు ఉన్నారు. ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు వ‌దులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.

అసంతృప్తిలో ఉమ, బుద్ధా వెంకన్న, వర్మ..!
గ‌త రెండు జాబితాల్లో జ‌న‌సేన‌, బీజేపీల‌ కంటే..టీడీపీ నేత‌ల‌కే ఎక్కువ పోస్టులు ద‌క్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జ‌ర‌గ‌లేదంటూ..మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, నాగుల్ మీరా స‌హా..దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటి వారు అసంతృప్తిలో ఉన్నారట.

Also Read : వైసీపీలో వరుస అరెస్ట్‌లు.. అసలు రీజన్‌ అదేనా? నెక్స్ట్ జైలుకెళ్లేది ఎవరు..

వీరికితోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి చంద్రశేఖ‌ర్‌రెడ్డి కూడా.. నామినేటెడ్ పోస్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇక‌ అనంతపురం జిల్లాకు చెందిన యామినీ బాల కుటుంబం కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో సహకార బ్యాంకు ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలో జిల్లా స్థాయి ఛైర్మన్ పదవులకు ద్వితీయ స్థాయి నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరికొందరు నేతలకు అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో విడత నామినేటెడ్‌ లిస్ట్ ఏ సమయంలోనైనా రిలీజ్‌ అవుతుందని చెప్తున్నారు. ఎవరెవరికి ఎమ్మెల్సీ బెర్తులు..కార్పొరేషన్ పదవులు దక్కబోతున్నాయనేది చూడాలి మరి.