×
Ad

TTD Coverts: టీటీడీలో లీకు వీరులు? పాలకమండలి నిర్ణయాలు, రహస్యాలు ముందే బయటపెడుతున్న కోవర్టులెవరు?

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్‌గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.

TTD Coverts: సర్కార్ కూటమిది. ఛైర్మన్‌ కూటమి ప్రభుత్వం నియమించిన వ్యక్తే. పాలక మండలిలోనూ కూటమి పార్టీల నేతలే ఉన్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయాలు.. టీటీడీ బోర్డు మెంటర్స్‌ కంటే ముందే వైసీపీ నేతలకు తెలిసిపోతున్నాయట. పాలక మండలి మీటింగ్..సమావేశం ఎజెండాపై పూర్తి డిటైల్స్.. ఓ విపక్ష నేతకు ముందే చేరిపోతున్నాయట. దీంతో లీకువీరులపై ఓ కన్నేసి పెట్టారట టీటీడీ పెద్దలు. కోవర్టుల వ్యవహారంపై ఈవోతో పాటు పాలక మండలి ఆగ్రహంగా ఉందట. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరో గుర్తించి..వారిపై యాక్షన్‌ తీసుకోవాలని భావిస్తున్నారట. ఇంతకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటికి చేరవేస్తున్నదెవరు?

తిరుమల తిరుపతి దేవస్థానం.. ఏడు కొండలవాడి సన్నిధిలో లీకు వీరుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీలో అంతర్గతంగా జరిగే ప్రతి చిన్న విషయం లీక్ అవుతుందట. ఇది విపక్ష వైసీపీకి అస్త్రంగా మారుతోంది. పాలకమండలి పెద్దలకు కూడా అందని సమాచారం..ముందుగా టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి తెలిసిపోతుందట. ఇదే ఇప్పుడు సంచలనంగా రేపుతోంది. టీటీడీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కొండ కింద..కొండ మీద అంతటా గుసగుసలకు కారణమవుతోంది.

పాలకమండలి నిర్ణయాలు, రహస్యాలు ముందే లీక్..

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్‌గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట. పాలకమండలి సభ్యుల కంటే ముందే భూమన కరుణాకర్ రెడ్డి చెవిన పడుతున్నాయట. ఈ అంశాలపై కరుణాకర్ రెడ్డి ప్రతీరోజు మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. టీటీడీలో ఇంకా చర్చకే రాని అంశాలను మీడియాకు వెల్లడించి తీవ్ర దుమారానికి కారణం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు గడిచిన రెండు మూడు నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.

తమిళనాడు కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ సంస్థ ప్రాంగణంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించాలని గతేడాది ఆగస్ట్‌లో సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో..త్వరలో జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెవిన పడింది. దీన్ని తప్పుపడుతూ రెండు రోజుల క్రితం కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
త్వరలో జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో కోయంబత్తూర్‌లో గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వబోతున్నారని, పాలకమండలి ఎజెండాలో 24వ అంశంగా దీన్ని చేర్చారని కూడా కరుణాకర్‌రెడ్డి పాయింట్‌ టు పాయింట్ వివరించారు. వాస్తవానికి టీటీడీ పాలకమండలి సమావేశం తేదీ, ఎజెండా ఇంకా ఖరారు కానేలేదు. అయినా భూమన ఎజెండాను, చివరకు ఎజెండాలోని అంశాల నెంబర్‌ను కూడా బయటపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాలతో పాలక మండలి సమావేశాల ఎజెండాను బోర్డు సెల్ రూపొందిస్తుంది. ఎజెండాలోని అంశాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. పాలకమండలి సభ్యులకు కూడా రెండు రోజులు ముందు ఎజెండా కాపీ పంపిస్తారు. అలాంటిది కరుణాకర్‌రెడ్డికి ముందుగానే ఎలా తెలిసిపోతుందన్నది సస్పెన్స్‌గా మారింది.

టీటీడీలో 2వేల మందికి పైగా ఆయన మనుషులు?

టీటీడీ బోర్డు సెల్ నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని జోరుగా చర్చ నడుస్తోంది. బోర్డు సెల్‌లో కీలక అధికారులు ఈ రహస్య సమాచారాన్ని భూమనకు చేరవేశారన్న డౌట్స్‌ వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలో 2వేల మందికి పైగా తన మనుషులు ఉన్నారంటూ మూడు నెలల కిందట భూమన ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే దేవస్థానం అంతర్గత వ్యవహారాలు ఆయనకు చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీటీడీ గోశాలలో గోవుల మృత్యువాత, క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు..అలిపిరి దగ్గర విగ్రహంపై వివాదం..శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న చిన్నపాటి ఘటనలు..ఇలా గత రెండు నెలలుగా చాలా అంశాలపై లీకు వీరుల నుంచి సమాచారం అందడంతోనే భూమన మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు భూమన. చివరకు టీటీడీ అధికారులు కరుణాకర్ రెడ్డిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకవైపు కరుణాకర్ రెడ్డిపై రాజకీయ, న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు టీటీడీలో లీకు వీరుల వ్యవహారంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు టీటీడీ పెద్దలు. సమాచారాన్ని బయటికి చేరవేస్తున్నదెవరో..కోవర్టులుగా పనిచేస్తున్నదెవరో గుర్తిస్తున్నారట. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి టీటీడీకి డిప్యూటేషన్‌పై వచ్చిన వారు, ప్రమోషన్లు పొందిన వారు, కీలక బాధ్యతలు దక్కించుకున్నవారు, కొత్తగా ఉద్యోగాలు పొంది..కరుణాకర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన వారు..వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నవారు..ఏదో ఒక రూపంలో కరుణాకర్ రెడ్డి చేత లబ్ధి పొందిన టీటీడీ ఉద్యోగులు, అధికారుల లిస్ట్‌ను రెడీ చేస్తున్నారట.

ఇలా గుర్తించిన దాదాపు 45 మందిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీరిని ఎలాగైనా టీటీడీ నుంచి బదిలీ చేయడమో..లేక కీలక బాధ్యతల నుంచి తప్పించడమో..ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని టీటీడీ పెద్దలు భావిస్తున్నారట. టీటీడీలో లీకువీరులు వ్యవహారం ఏ మలుపు జరుగుతుందో చూడాలి మరి.

Also Read: కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న జగన్ అస్త్రం.. వైసీపీ మెడకే చుట్టుకుంటుందా?