పవన్ కల్యాణ్ గెలుపుతో పిఠాపురం దశ మారనుందా? జనసేనాని మాస్టర్ ప్లాన్ ఏంటి?

పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్‌కు తిరుగులేని విజయం అందించి... తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేలా అండగా నిలిచారు.

Pithapuram Development : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం దశ తిరగబోతోందా? తిరుగులేని మెజార్టీతో పవన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన పిఠాపురం వాసుల రుణం తీర్చుకోడానికి పవర్ ఫుల్ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారా? తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంగా పిఠాపురంను నిలబెడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జనసేనాని… తన సొంత నియోజకవర్గానికి ఏం చేయనున్నారు? కొద్దిరోజుల్లో పిఠాపురంలో పర్యటించనున్న పవన్ ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటి?

ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పవన్ కు తిరుగులేని విజయం..
పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేస్తానన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్…. తన హామీని నెరవేర్చుకునే పని మొదలుపెట్టారా? అంటే ఔననే అంటున్నాయి జనసేన వర్గాలు…. జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలనలో వినూత్న పంథా అనుసరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్… తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్నికల సమయంలోనే కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను పవన్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

పిఠాపురం వాసుల రుణం తీర్చుకోనున్న పవన్..
పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్‌కు తిరుగులేని విజయం అందించి… తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేలా అండగా నిలిచారు. ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించిన పిఠాపురం వాసుల రుణం తీర్చుకోవాలని భావిస్తున్న జనసేనాని… నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కుప్పం, మంగళగిరికి దీటుగా పిఠాపురం..
అభివృద్ధిలో పోటీ పడతానంటున్న పవన్… కూటమిలో కీలక నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్ఆర్డీ, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ నియోజకవర్గాలైన కుప్పం, మంగళగిరికి దీటుగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. కుప్పం నుంచి 9 సార్లు గెలిచిన చంద్రబాబు… ఆ నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్శిటీతోపాటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. ఇక ఇజ్రాయెల్ సేద్యాన్ని పరిచయం చేసి తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే టెక్నాలజీని కుప్పం వాసులకు అలవాటు చేశారు.

ఉద్యాన పంటలకు నెలవైన కుప్పంలో పండే పూలు, పండ్లను అంతర్జాతీయ మార్కెట్‌కు తరలించాలనే ఉద్దేశంతో కుప్పంలో ఎయిర్‌ కార్గో అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం 2019కు ముందే సన్నాహాలు మొదలైనా, గత ఎన్నికల్లో ఓటమితో ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు… కుప్పంలో ఎయిర్ కార్గో కోసమే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మంత్రి లోకేశ్ తన సొంత నియోజకవర్గం మంగళిగిరిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు మంగళగిరి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఐదేళ్లు మరిన్ని సంస్థలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు లోకేశ్.

పవన్ స్పెషల్ ప్లాన్..
అభివృద్ధిలో పోటీ పడతానని చెబుతున్న పవన్.. కుప్పం, మంగళగిరికి దీటుగా పిఠాపురం నియోజకవర్గాన్ని నిలపాలనే ఉద్దేశంతో స్పెషల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. పిఠాపురంలో ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు. వరి పంటకు పిఠాపురం ప్రసిద్ధి. అదేవిధంగా పిఠాపురంను టెంపుల్‌ సిటీగా పిలుస్తారు. ఇక్కడ పాదగయతోపాటు ప్రఖ్యాత కుక్కుటేశ్వరస్వామి ఆలయం, పది శక్తి పీఠాల్లో ఒకటైన అష్టాదశ శక్తి పీఠం పిఠాపురంలోనే ఉంది. ఇక్కడ పురుహూతికా దేవిని ఆరాధ్య దేవతగా పూజిస్తుంటారు.

ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పిఠాపురం అభివృద్ధి..
ఇక శ్రీపాద వల్లభుడి క్షేత్రమైన పిఠాపురంలో సాక్ష్యాత్తూ దత్తాత్రేయుడు స్వయంభుగా వెలిశాడు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న పిఠాపురంను టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు పవన్‌. ఇక నియోజకవర్గంలో భాగమైన ఉప్పాడ సముద్ర తీరంపైనా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు పవన్. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పిఠాపురంను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనేది పవన్ ప్లాన్.

ఇక పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా వరి, పత్తి పండిస్తుంటారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ఏలేరు రెండోదశ ఆధునికీకరణ పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య పరిష్కరించాల్సి వుంది. ఎన్నికల సమయంలో ఈ సమస్యలపై హామీ ఇచ్చిన పవన్…. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన తొలి పర్యటనలోనే ప్రధాన సమస్యలకు ఓ పరిష్కారం చూపాలని భావిస్తున్నారు పవన్. అదే విధంగా పిఠాపురం అంటే గుర్తుకు వచ్చేది ఉప్పాడ పట్టు. ఇక్కడ చేనేత కార్మికుల నైపుణ్యంతో ఉప్పాడ పట్టుకు ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ, గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఉప్పాడ చీరల మార్కెటింగ్ కష్టమవుతోంది. ఈ సమస్యకు పవన్ పరిష్కారం చూపుతారని స్థానిక చేనేతకారులు ఆశిస్తున్నారు. సినీ రంగానికి చెందిన పవన్‌కు ఉప్పాడ చేనేత పరిశ్రమపై పూర్తి అవగాహన ఉంది.

ఇలా మొత్తం పిఠాపురం ముఖచిత్రం మార్చేలా… తన నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు పవన్. ఇందుకోసం ఇప్పటికే కొందరు రిటైర్డ్‌ ఐఏఎస్‌లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తానికి తను ఈ స్థాయికి రాడానికి ప్రధాన కారణమైన పిఠాపురంపై పవన్‌ మాస్టర్‌ ప్లాన్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు

ట్రెండింగ్ వార్తలు