East Godavari TDP: టీడీపీ అంతర్గత రాజకీయాలు మంచి కాక మీద కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనట్లు పార్టీ పదవుల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల కోసం నేతలు ఎత్తులుపైఎత్తులు వేస్తున్నారు. హైకమాండ్ దృష్టిని ఆకట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడి ఎంపిక మరింత క్లిష్టంగా మారిందని అంటున్నారు. ఈ జిల్లా అధ్యక్ష పదవికి నాలుగైదు పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత పార్టీ అధ్యక్షుడిగా ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ ఉన్నారు. ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి ఇవ్వడంతో తప్పనిసరిగా కొత్త వారికి పార్టీ పదవి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీనియర్ నేత గన్ని కృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఎర్ర వేణుగోపాల్ నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ ఐదుగురిలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేరుపై మంత్రి నారా లోకేశ్ ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన ఇప్పటికే రుడా ఛైర్మన్ గా ఉండటం, ఆయన సామాజికవర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడం ఇప్పుడు ఆటంకంగా మారే పరిస్థితి ఉందట. ఇక రేసులో ఉన్న గన్ని కృష్ణ, ముళ్లపూడి బాపిరాజు వంటి నేతలు సీనియర్లుగా గుర్తింపు ఉన్నప్పటికీ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తోందట అధిష్టానం. దీంతో ఈ ఇద్దరికీ జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశాలు తక్కువే అన్న టాక్ వినిపిస్తోంది. మిగిలిన ఇద్దరిలో ఒకరైన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎర్ర వేణుగోపాల్ పేరు పరిశీలనలో ఉంది.
అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి అదే సామాజకవర్గానికి ఇచ్చే అవకాశం ఉండటంతో..ఎర్ర వేణుగోపాల్ పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం తక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక మిగిలిన నేత కుడుపూడి సత్తిబాబు పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్న హైకమాండ్ యువకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని అంటున్నారు. దీంతో బొడ్డు వెంకటరమణ చౌదరి వర్సెస్ కుడిపూడి సత్తిబాబు మధ్య పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఇద్దరు మంత్రి లోకేశ్ కు అనుచరులే కావడం విశేషం. ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా రెండు సామాజికవర్గాల వారు అత్యధికమంది ఉన్నారు. అందులో ఒక సామాజికవర్గం కాపులైతే మరొక సామాజికవర్గం శెట్టిబలిజలని చెప్పాలి.
కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పగ్గాలు శెట్టిబలిజకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. రాష్ట్రంలో శెట్టిబలిజలను అందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చిన నేతగా కుడుపూడి సత్తిబాబుకు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ బీసీలకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, ప్రస్తుతం టీడీపీ కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందట.
ఈ ఈక్వేషన్స్‌ను బట్టి చూస్తే కుడుపూడి సత్తిబాబుకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక వెంకటరమణ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ ఇద్దరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఎవరికి పార్టీ పదవి దక్కినా నామినేటెడ్ పోస్ట్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు వాళ్లు ఒప్పుకుంటారా లేదా అన్నదే అతి పెద్ద చర్చ.