Kolikapudi Srinivasa Rao: ఇక వేటేనా? కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా ఎమ్మెల్యే కొలికపూడి.. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాక కథ తేలుస్తారా?
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
Kolikapudi Srinivasa Rao: కొలికపూడి శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు..టీడీపీ నేతగా..అమరావతి రైతుల పక్షాన గళం వినిపించి ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యారు. అమరావతి రైతుల ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఈయన..గత ఐదేళ్లు లైమ్‌లైట్‌లో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై స్ట్రాంగ్ వాయిస్ వినిపించిన కొలికపూడి..ఇప్పుడు పవర్‌లోకి వచ్చాక సొంత పార్టీకే హెడెక్‌గా మారారు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ టీడీపీ అధిష్ఠానాన్ని చిక్కుల్లో పడేస్తున్నారట కొలికపూడి.
అవమానించారంటూ పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్..
తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలోని ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య రోడ్డు పంచాయితీలో తలదూర్చి ఇరకాటంలో పడిపోయారు కొలికపూడి. ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి, అవమానకరంగా తిట్టారంటూ వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇష్యూ పెద్దది కావడంతో పార్టీ కొలికపూడి వివరణ కోరి..మందలించింది. ఇదొక్కటే కాదు పలు సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్ అయ్యారు కొలికపూడి.
అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన ఆయన..తన దుందుడుకు తీరుతో టీడీపీ అధిష్టానానికి హెడెక్‌గా మారారట. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే గతేడాది జూలైలో ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైసీపీ నేత పంచాయతీ స్థలం ఆక్రమించి, భవనం కట్టాడని దాన్ని పడగొట్టాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. ఉన్నఫళంగా బిల్డింగ్‌ను కూల్చలేమని, ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా వినకుండా అక్కడే బైటాయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో సీఎం చంద్రబాబు శ్రీనివాస్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ సొంత పార్టీ నేతను అందరి ముందు తిట్టడంతో సదరు ప్రజాప్రతినిధి సతీమణి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ వివాదం చల్లారకముందే ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేసి సంచలనం సృష్టించారు. ఇక లేటెస్ట్‌గా ఎంపీ కేశినేని చిన్నిని గెలికి.. పార్టీని రచ్చకు ఈడ్చారు కొలికపూడి. దీంతో టీడీపీ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీ వాళ్లతో అంటకాగుతున్నారనే విమర్శలు..
తిరువూరు నియోజకవర్గంలో జరిగే మట్టి దందాకు కొలికపూడి అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తన గెలుపు కోసం పని చేసిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టి వైసీపీ వాళ్లతో అంటకాగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇదే అర్థం వచ్చేలా కొలికపూడి తీరుపై మండిపడ్డారు.
వైసీపీ వారే తిరువూరు మైనింగ్‌లో కీలకంగా ఉన్నారట. వాళ్లతో కలిసే కొలికపూడి దందా చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం పెద్ద సంఖ్యలో పార్టీ హెడ్ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. చాలా మంది నేతలు ఎంపీ కేశినేని చిన్ని వెంట నడుస్తున్నారట.
ఇక కొలికపూడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. కొలికపూడి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని..ఆయనపై అధిష్ఠానం యాక్షన్ తీసుకుని పరిస్థితిని చక్కబెట్టాలంటున్నారు నియోజకవర్గ టీడీపీ నేతలు.
గతంలో ఎన్నో ఇష్యూస్ తెరమీదకు వచ్చినా..ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్నితో వివాదంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందట. వరుస వివాదాలతో రచ్చ చేస్తున్నారనే కొలికపూడిని టీడీపీ అధిష్టానం సైడ్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. తిరువూరు టీడీపీ బాధ్యతలు కూడా కేశినేని చిన్నికి అప్పగించి.. కొలికపూడి కోరలు పీకేశారని అంటున్నారు. అయినా కొలికపూడి తగ్గకుండా తన నోటికి పని చెప్తుండటంతో టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందట. ఈ క్రమంలోనే ఆయనను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ ఆఫీస్‌కు రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
రంగంలోకి చంద్రబాబు.. తిరువూరు వార్ కు ఎండ్ కార్డ్..
అయితే సీఎం చంద్రబాబే రంగంలోకి దిగుతున్నారట. తన విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక..తిరువూరు వార్‌కు ఎండ్ కార్డ్ వేస్తానని పార్టీ నేతలకు చెప్పారట చంద్రబాబు. అయితే అధినేతే తిరువూరు ఇష్యూ మీద ఫోకస్ పెట్టడంతో..కొలికపూడిపై ఈసారి కఠిన చర్యలే ఉంటాయని అంటున్నారు. వేటు వేసే ఆలోచనలో కూడా టీడీపీ అధిష్టానం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొలికపూడిపై యాక్షన్ ద్వారా తీరు మారని మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఓ వార్నింగ్ ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీ సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఎలాంటి డెసిషన్స్ ఉంటాయో చూడాలి.
Also Read: లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ ఫోకస్.. రాద్దాంతం ఎందుకు? ఆరా తీయడం తప్పా?
