Gossip Garage : ఒక్క పోస్ట్‌.. ఇద్దరు లాబీయింగ్..! ఆ నామినేటెడ్‌ పోస్ట్‌ కు ఎందుకంత డిమాండ్? దక్కేదెవరికి?

ఇప్పటికే పదవులు దక్కినోళ్లు ఫుల్‌ జోష్‌లో ఉండగా..ఖాళీగా ఉన్న పోస్టులపై కన్నేసిన నేతలు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట.

Gossip Garage : నగరంలో ఉన్నతస్థాయి పదవి. ఆ పోస్ట్ దక్కితే తిరుగుండదు. హోదాకు హోదా.. ఆదాయానికి ఆదాయం..రెండూ ఉంటాయి. అందుకే అందరి దృష్టి ఆ పోస్ట్‌పైనే పడిందట. ఒక్క బెర్త్ కోసం మూడు పార్టీల నుంచి ఆశావహులు జోరుగా పైరవీలు చేస్తున్నారట. కష్టపడ్డాం మాకే కావాలని ఒకరు..పొత్తులో సీటు త్యాగం చేశా తనకే దక్కాలని మరో నేత రేసులో ఉన్నారట. రెండోసారి ఈడా కుర్చీ కోసం ఓ లీడర్..అయితే ఎమ్మెల్సీ లేకపోతే ఈడా పోస్ట్‌ అని మరో నేత లాబీయింగ్ చేస్తున్నారట. ఇంతకీ ఈడా ఛైర్మన్ పోస్ట్‌ భర్తీ ఎప్పుడు.? కూటమి ప్రభుత్వం ఆ నామినేటెడ్‌ పోస్ట్‌ను ఎందుకు వాయిదా వేస్తుంది.? ఈడా ఛైర్మన్ పోస్ట్‌ దక్కేదెవరికి.?

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జోరు ఓ వైపు, ఆశావహుల్లో బేజారు మరోవైపు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పదవులు దక్కినోళ్లు ఫుల్‌ జోష్‌లో ఉండగా..ఖాళీగా ఉన్న పోస్టులపై కన్నేసిన నేతలు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్ పోస్ట్‌ కోసం పావులు కదుపుతున్న నేతల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏలూరు జిల్లాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారట కూటమి నేతలు. కనీసం స్థానికంగా ఉన్న ఈడా ఛైర్మన్ పదవినైనా త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారట.

ఛైర్మన్‌ కుర్చీలో కూర్చునేందుకు పోటీ?
జిల్లాలో ఓ ఉన్నత స్థాయి ప్రోటోకాల్ పదవి ఇదే కావడంతో, ఛైర్మన్‌ కుర్చీలో కూర్చునేందుకు నేతలు భారీగానే క్యూ కడుతున్నారట. అయితే రెండోసారి ఈడా చైర్మన్ పదవి కోసం ఎమ్మార్డీ ఈశ్వరీ బలరాం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు ఈసారైనా న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారట.

Also Read : కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనా? ఈ నెల 30 తర్వాత అరెస్టులు ఉండబోతున్నాయా?

ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈడా పరిధి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు అత్యధిక విస్తీర్ణంలో ఉంటుంది. అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలు కూడా ఎక్కువే. దీంతో ఈడా ఛైర్మన్ పదవి దక్కితే పంట పండినట్లేనని.. దీనికి తోడు ప్రోటోకాల్ కూడా ఉంటుందనే ఆశతో ఉన్నారట నేతలు. ప్రధానంగా మాజీ ఈడా ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాంతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్లు తెరమీదకు రావడంతో ఈడా కుర్చీపై పోరు రసవత్తరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. జనసేన నేత రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి ఇవ్వడంతో జనసేన నుంచి ఆ పదవి రేసులో పెద్ద స్థాయి నేతలు ఎవరూ లేరంటున్నారు. దాంతో తమకే ఈ పదవి ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్టానానికి సిఫార్సులు చేయించుకుంటున్నారట.

వైసీపీని వీడి ఎన్నికల ముందు టీడీపీలో చేరిక..
రేసులో ఉన్న మాజీ ఈడా ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరీ సుదీర్ఘకాలంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్లనానికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైసీపీ హయాంలో ఈడా ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే రెండోసారి ఈశ్వరీనే ఆ పదవిలో కొనసాగించేందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు. దాంతో వైసీపీని వీడి ఎన్నికల ముందు టీడీపీలో చేరింది ఎమ్మార్డీ కుటుంబం.

ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి చంటి గెలుపునకు సహకరించడంతో, టీడీపీ అధిష్టానం కచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తుందని ఎమ్మార్డీ కుటుంబం ఆశతో ఎదురు చూస్తోందట. ఇందులో భాగంగానే వైసీపీలో రెండోసారి ఆశించిన ఈడా ఛైర్మన్ పదవిని టీడీపీలో దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈడా ఛైర్మన్ రేసులో మరో ప్రధాన నేత, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేరు తెర మీదకు వచ్చింది. ఆయన ఈడా పోస్ట్‌ ఆశిస్తే, గన్నీని కాదని మరొకరికి దక్కదనే చర్చ గట్టిగా వినిపిస్తుంది. టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉండటం..2019 ఎన్నికల్లో ఓడినా పార్టీలోనే కొనసాగుతూ, 2024లో జనసేనకు సీటును కూడా త్యాగం చేశారు గన్ని. ఈ అంశాలు ఆయనకు ఈడా ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు సానుకూలంగా కనిపిస్తున్నాయట.

జిల్లాలో ప్రోటోకాల్ పదవితో పాటు ఆర్థిక లబ్ధి కలిగించే పోస్ట్ కావడంతో ఆయన కూడా ప్రయత్నలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గన్ని అభిమానులు మాత్రం, ఈడా ఛైర్మన్ పదవి కోసం తమ నేత ఎదురు చూడటం లేదని.. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని చెబుతున్నారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోస్టులు అన్నీ భర్తీ చేస్తున్న టీడీపీ అధిష్టానం ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ పోస్ట్‌ను మాత్రం పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. నిజంగా గన్ని వీరాంజనేయులు ఈడా ఛైర్మన్ పదవి ఆశిస్తే, సీఎం చంద్రబాబు ఆయన్ను కాదని మరొకరికి ఇస్తారా.. లేక రెండోసారి ఎమ్మార్డీ ఈశ్వరికే ఈడా బాధ్యతలు దక్కుబోతున్నాయా.. వీరిద్దరూ కాకుండా క్యూలో ఉన్న మరికొంతమంది నేతల పరిస్థితి ఏంటి..? ఇదే ఇప్పుడు ఏలూరు పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.

 

Also Read : కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్‌.. ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారా?