Amaravati Bill: ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లు.. వైసీపీది మళ్లీ అదే టోన్.. నెక్స్ట్‌ ఏం జరగబోతోంది?

రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు జగన్. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్‌ బి పేరిట జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు.

  • Published On : April 1, 2026 / 09:07 PM IST
  • అమరావతికి రాజముద్ర కోసం లైన్‌క్లియర్
  • రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
  • రాజ్యసభలో బిల్లు పెట్టాక రాష్ట్రపతి ఆమోదం
  • అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలపని వైసీపీ
  • రాజధాని విషయంలో ప్లాన్‌ బి అంటూ జగన్‌ కొత్త రాగం
  • మావిగన్‌ పేరుతో మూడు జిల్లాలతో రాజధాని అంటూ ప్రతిపాదన

 

Amaravati Bill: రాజధానికి రాజముద్ర పడేందుకు ఇంకో అడుగు ముందుకు పడింది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో బిల్లు పెట్టాక రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నారు. ఇక వైసీపీ మళ్లీ డిఫరెంట్‌ వాయిస్ వినిపించింది. రాజధాని నిర్మాణం పేరుతో అవినీతి చేస్తున్నారన్న జగన్..ఏపీ క్యాపిటల్‌ విషయంలో ప్లాన్‌ బి తెరమీదకు తెచ్చారు. లోక్‌సభలో రాజధాని బిల్లుపై మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి..ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు. అమరావతిపై నెక్స్ట్‌ ఏం జరగబోతోంది?

ఏపీ రాజధాని అమరావతికి రాజముద్ర. ఏడాదిగా ఎన్నో మలుపులు తిరిగిన ఈ అంశం ఎట్టకేలకు పార్లమెంట్‌ టేబుల్‌ మీదకు వెళ్లింది. లోక్‌సభలో అమరావతి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. గెజిట్ ద్వారా రాజధానికి రాజముద్ర పడనుంది.

లోక్‌సభలో బిల్లుపై చర్చ సమయంలో బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, పురందేశ్వరి, టీడీపీ ఎంపీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడారు. రూపాయి ఖర్చు లేకుండా సీఎం చంద్రబాబు వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించారని, బాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని పెమ్మసాని చెప్పారు. రాజధాని అంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు ఎంపీ సీఎం రమేష్. ప్రజా రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇక అమరావతికి కాదు..బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి..ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి ..సభ నుంచి వాకౌట్‌ చేశారు వైసీపీ ఎంపీలు.

ఆ ఉద్దేశంతోనే మూడు రాజధానుల స్లోగన్‌..

రాష్ట్ర రాజధాని నిర్ణయమన్నది రాష్ట్రం ఇష్టమని..గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ సభ్యులు ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై మాట్లాడితే బాగుండేదన్న మిథున్‌రెడ్డి..అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వలేదన్న అంశాన్ని ఎక్స్‌పోజ్‌ చేసే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా తమ మూడు రాజధానుల కాన్సెప్ట్‌పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకే దగ్గర కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు అవసరమని..అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల స్లోగన్‌ ఎత్తుకున్నట్లు చెప్పుకొచ్చారు.

మావిగన్.. జగన్ కొత్త స్లోగన్..

ఇక లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చకు వచ్చే ముందు ప్రెస్‌ మీట్ పెట్టిన వైసీపీ అధినేత జగన్..రాజధాని అంశంలో కొత్త పల్లవి అందుకున్నారు. అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్రతిపాదించారు. రాజధానికి ప్లాన్‌ బి పేరిట జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు దారితీశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని ప్రపోజల్ పెట్టారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు దూరం 70 కి.మీ. విజయవాడ నుంచి గుంటూరుకు 40కి.మీ. ఈ ప్రాంతంలో మొత్తం 110 కి.మీ హైవే ఉంది. మావిగన్‌ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్‌ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి అంటూ జగన్‌ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు జగన్.

రాజధాని అమరావతే.. ఇక ఇంచు కూడా కదిలించలేరు..

రాజధానికి చట్టబద్ధతపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన చంద్రబాబు.. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని..స్వర్ణాంధ్రకు ఆరు సూత్రాలతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు. గత ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన కొనసాగిందని..వైసీపీది మూడు ముక్కలాట ..మూడు రాజధానుల నినాదమని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరుకాలేదని విమర్శించారు. తన జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని, పార్టీని చూడలేదని సీఎం చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.

ఏదైనా రాజధాని విషయంలో వైసీపీ మల్టీపుల్ వెర్షన్స్ వినిపించడం ఓవైపు చర్చకు దారితీస్తోంది. మరోవైపు విమర్శల పాలు అవుతోంది. జగన్‌ మాత్రం అమరావతి నిర్మాణంతో పేరుతో జరుగుతున్న కరప్షన్‌కు మాత్రమే వ్యతిరేకమంటూ చెప్పుకు రావడం ఆసక్తికరంగా మారింది.

Also Read: మరో 30 ఏళ్లు వైసీపీ రాదు..! చంద్రబాబుకి అంత ధీమా ఎక్కడిది? ఆ నమ్మకం వెనుకున్న భరోసా ఏంటి?