Gossip Garage : ఏపీలో వైసీపీ నేతల్ని కేసులు వెంటాడుతున్నాయా.. ఏ మాత్రం నోరు తెరిచినా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా.. అధికారుల జోలికి వెళ్తే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారా.. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో కాకాణి రేపిన కాక ఏంటి?
అలాంటి నేతలకు చుక్కలు చూపిస్తున్న కూటమి ప్రభుత్వం..
గత ఐదేళ్లలో వైసీపీ నేతలు మైకు పడితే పూనకం వచ్చినట్టే ఊగిపోయేవారని టాక్ ఉండేది. టీడీపీ లీడర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే వాళ్లు.. కానీ అధికారం చేజారిపోయాక కొందరు నేతలు వారి నోళ్లకు తాళం వేసినట్లు కనిపిస్తున్నారు. కొందరు మాత్రం ఏ మాత్రం డోస్ తగ్గించడం లేదట. పొలిటికల్ ప్రత్యర్థుల్నే కాదు. అడ్డొచ్చిన అధికారుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. అలాంటి నేతలకు చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారుల్ని ఒక్క మాట అన్నా కేసు బుక్ చేసి పడేస్తోంది.
ఎంత తోపు అయినా నోరు జారితే తిప్పలే..
అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా నడిచిపోతుంది. అలా అని.. అధికారం చేతిలో లేనప్పుడు.. ఎంత తోపు అయినా నోరు జారితే తిప్పలే ఎదురవుతాయన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తించడం లేదని ఓ గాసిప్ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఐదేళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు.. ఆయా పార్టీల నేతలు కాస్త తేడాగా మాట్లాడినా.. కొన్నిసార్లు మాట్లాడకున్నప్పటికీ కేసులతో బుక్ చేసిన వైనాన్ని వారెందుకు మర్చిపోతున్నారు అనే డిబేట్ లోకల్ లో నడుస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులు అదే తీరుతో ఉంటారన్న ఆలోచనను వైసీపీ నేతలు విస్మరిస్తున్నారా! అనే అనుమానం కలుగుతోంది. అలాంటి విషయాల్ని మర్చిపోయిన వారందరికి కేసులతో షాకులు ఎదురవుతున్నాయి.
Also Read : వెంటాడుతున్న కేసులు.. వైసీపీ నేతలకు పెద్ద సవాల్
కేసు విషయం ఆలస్యంగా తెలిసి షాక్ లో కాకాణి వర్గీయులు..
తాజాగా నెల్లూరు జిల్లాలో కాకాణి ఎపిసోడ్.. ఏపీ రాజకీయాల్లో కాకారేపుతోంది. కేసుల జాబితాలోకి చేరిపోయారు ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆయనపై నెల్లూరు నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. డిసెంబర్ 27న కేసు నమోదైతే.. ఆ విషయం జనవరి ఆరున బయటకు వచ్చింది. దీంతో కాకాణి వర్గీయులు షాక్‌కు గురవుతున్నారట. వెంకటాచలం మండలానికి చెందిన ఒకరు ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంతకూ కేసు నమోదు చేసేంత పని కాకాణి ఏం చేశారంటే చాలానే విషయాలు బయటకు వస్తున్నాయట. కాకాణికి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట శేషయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళ తనను శేషయ్య వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది.
వెంకటాచలం సీఐపై విరుచుకుపడ్డ కాకాణి..
తన ప్రధాన అనుచరుడిని రిమాండ్ చేయడంతో మాజీ మంత్రి కాకాణి రగిలిపోయారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. వెంకటాచలం సీఐపై విరుచుకుపడ్డారు. వెంకటాచలం సీఐ సుబ్బారావు ఖాకీ దుస్తులు ఊడదీసి.. శాశ్వతంగా పచ్చ చొక్కా వేసుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఐ సుబ్బారావును విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐతో పాటు వెంకటాచలం ఆర్ఐ రవిపైనా ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ అధికారులను మాజీమంత్రి బెదిరించడంతో పోలీసులు లైట్ తీసుకోలేదు. కాకాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటు కాకాణి కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్లనుందని హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : బలమైన భారత్ కోసం కృషి చేస్తున్నారు- ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం