×
Ad

Ys Jagan: అన్నంత పని చేస్తున్న జగన్..! స్నేహితుడిని కాదని కొత్త వారికి పగ్గాలు? వైసీపీ అధినేతలో ఎందుకింత మార్పు..!

జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆయనతోనే ప్రయాణించిన నేతల్లో ఆ మాజీ ఎమ్మెల్యే ఒకరు.

Ys Jagan: దారుణంగా ఓడిపోయాం. విపక్షంలో ఉన్నాం. మళ్లీ పవర్‌లోకి రావాలి. అందరూ యాక్టీవ్‌గా పని చేయాలి. లేకపోతే మీ ఇష్టం ఆల్టర్నేట్ చేసుకుంటానని చెప్పి అన్నంత పని చేస్తున్నారట వైసీపీ అధినేత జగన్. నో ఫ్రెండ్ షిప్..నో రిలేటివ్స్..నో ఎమోషన్స్..ఓన్లీ పార్టీ అంటున్నారట. పార్టీ బాగుంటే అందరం బాగుంటాం. అలా ఉండాలంటే..ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారట. నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను యాక్టీవ్ చేస్తూ..అవసరమైతే సీనియర్లు, కొత్త వారికి పగ్గాలు అప్పగిస్తూ వస్తున్నారట. జగన్‌లో ఈ మార్పు ఎందుకు? సొంత ఇలాకాలో ప్రక్షాళన మొదలుపెట్టారా?

ఆ మధ్య ఎమ్మిగనూరు. మొన్న జమ్మలమడుగు. ఇప్పుడు రైల్వేకోడూరు. సీమలో తిరిగి అదే స్థాయి బౌన్స్‌ బ్యాక్ అయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ రూట్‌ మారుస్తున్నారట. పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నారట. ఒక్కో నియోజకవర్గంలో రిపేరి షురూ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ ఫస్ట్.. ఫ్రెండ్ షిప్ నెక్స్ట్ అన్నట్లుగా..పని చేసే వాళ్లకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ..చాపకింద నీరులాగా ప్రక్షాళన చేస్తున్నారట జగన్. కడప జిల్లాపై అయితే జగన్ సీరియస్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. జిల్లాలో తన స్నేహితుడిని కాదని కొత్త నేతకు నియోజకవర్గ పగ్గాలు అప్పజెప్తారన్న ప్రచారం జరుగుతోంది. డీలిమిటేషన్ జరిగితే ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న ఆ స్థానం జనరల్ కేటగిరీకి మారుతోందట. దీంతో ఆ సీటులో ఇంచార్జ్‌ మార్పు కోసం వైసీపీ అధిష్టానం చర్యలు చేపడుతున్నట్లు టాక్.

ఓటమితో బెంగళూరు, తిరుపతికే పరిమితం..

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం రైల్వే కోడూరు. రాజకీయాలను శాసించగలిగే ప్రాంతంగా కోడూరుకు పేరుంది. కోడూరులో వైసీపీకి మంచి పట్టు ఉంది. జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆయనతోనే ప్రయాణించిన నేతల్లో కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒకరు. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కొరముట్ల.. 2024 ఎన్నికల్లో..మొదటిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన జనసేన నేత అరవ శ్రీధర్ చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత జనాలకు అందుబాటులో లేకుండా బెంగుళూరు, తిరుపతికి పరిమతమయ్యారట కొరముట్ల. జగన్ రాజకీయాల్లో ఉన్నంత కాలం కోడూరు సీటు కొరముట్లకు ఫిక్స్ అనే మాట మొన్నటిదాకా వినపడేది. కానీ గత కొంతకాలంగా కోడూరులో ఫ్యాన్ పార్టీ ఇంచార్జ్‌ను మారుస్తుందన్న టాక్ రిసౌండ్ చేస్తోంది.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రస్తుతం రైల్వేకోడూరు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కోడూరుకు కొత్త ఇంచార్జ్‌ నియమించే ఆలోచనలో ఉన్నారట జగన్. 2026లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ రిజర్వేషన్లు మారితే..కోడూరు జనరల్ కేటగిరీకి మారే ఛాన్స్ ఉందంటున్నారు. అదే జరిగితే అప్పుడు కొత్త లీడర్ కోసం ప్రయత్నాలు చేయాలి. అప్పటికప్పుడు కొత్త నేతను ఇంచార్జ్‌గా పెట్టి..టెన్షన్ పడటం కంటే ఇప్పుడే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట మాజీ సీఎం జగన్. అందుకే రైల్వే కోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డిని కోడూరు ఇంచార్జ్‌గా నియమిస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

జగన్ తో నేరుగా సంబంధాలు, రెడ్డి సామాజిక వర్గం..

ధ్వజారెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ..కోడూరులో యాక్టీవ్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. ధ్వజారెడ్డికి వైఎస్సార్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. జగన్‌తో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం, రెడ్డి సామాజిక వర్గం ధ్వజారెడ్డికి కలిసొచ్చే అంశాలు. అయితే అధికార పార్టీలో జనసేన తరుఫున ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నా టీడీపీ ఇంచార్జి ముక్కా రూపానంద రెడ్డి చక్రం తిప్పుతున్నారు. రాబోయే కాలంలో రూపానందరెడ్డిని ఎదుర్కోవాలంటే కొరముట్ల కంటే ధ్వజారెడ్డే సరైన క్యాండిటేట్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

నియోజకవర్గ వ్యాప్తంగా అనధికారికంగా ధ్వజారెడ్డి పర్యటిస్తుండటం కూడా ఇంచార్జ్‌ మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కొరముట్లను సైడ్ చేసి ధ్వజారెడ్డికి ఇంచార్జ్‌ పగ్గాలు ఇస్తే లోకల్ పోరులో పార్టీ మెరుగైన సీట్లు సాధిస్తుందని భావిస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేలోపే..ఇంచార్జ్‌ను ఫైనల్ చేస్తే గ్రామాల్లో పార్టీ బలోపేతం అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. గత మూడు టర్మ్‌లు వైసీపీ ఇలాకాగా ఉన్న సీటులో తిరిగి వైసీపీ పాగా వేయడం సాధ్యమేనా? జగన్ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read: ఏపీలోనూ లోకల్‌ ఫైట్‌..! పార్టీలు రెడీనా? వైసీసీ దగ్గరున్న అస్త్రాలేంటి.. కూటమి ప్లాన్స్ ఏంటి..