Representative Image (Image Credit To Original Source)
Seediri Appalaraju: ఆయనకు పొలిటికల్ ఫైర్‌బ్రాండ్ అని పేరు. లాజిక్ పాయింట్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వారు. కట్ చేస్తే ఇప్పుడా నాయకుడికి సొంత పార్టీలోనే ఇబ్బందులు తప్పడం లేదా అంటే.. అవును అనే గుసగుసలే వినిపిస్తున్నాయ్. అంతా వన్ మ్యాన్ షోగా చేస్తుండడంతో.. ఆప్తులు దూరం అవుతున్నారా.. ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవడం లేదా.. ఇంతకీ ఎవరా నేత.. గ్రూప్‌ల గోలతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు, కేడర్‌కు మధ్య అసలు దూరం ఎందుకు పెరిగింది?
మాజీమంత్రి సీదిరి అప్పలరాజుకు.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అని పేరు. 2019లో పలాస నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. జగన్ కేబినెట్‌లో కీలక శాఖ దక్కించుకున్నారు. అప్పట్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ పదవి నిలబెట్టుకున్నారు. జగన్‌కి నమ్మినబంటులా ఉంటూ వస్తున్న ఆయన.. అధినేతపై ఎవరు విమర్శలు చేసినా.. వెంటనే కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు. అలాంటి నాయకుడిపై ఇప్పుడు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవతున్నాయా అనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో లుకలుకలతో ఆయన సర్దుబాటు కావడం లేదట. అసమ్మతి నేతలు ఆయనకు మరింత తలపోటుగా మారారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన నేతలను.. సీదిరి పక్కన పెట్టారనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఓ కోటరీని నమ్ముకొని.. దాని మధ్యలోనే ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. దువ్వాడ శ్రీకాంత్‌తో పాటు.. దువ్వాడ హేంబాబు చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు లాంటి సీనియర్ నేతలు.. వైసీపీని విడిచి వెళ్లిపోయింది కూడా సీదిరి తీరు నచ్చకే అనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే ఈ ప్రభావం గత ఎన్నికల్లోనూ కనిపించింది. గత ఎన్నికల్లో గౌతు శిరీష చేతుల్లో భారీ పరాభవాన్ని మూటగట్టుకున్నారు సీదిరి. ఐతే ఓటమి తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని.. పలాస నేతల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్ర రాజకీయాలపై ఎప్పటికప్పుడు స్పందించే సీదిరి.. నియోజకవర్గంలో మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదని.. తన చుట్టూ ఉన్న వారితోనే పార్టీని నడపాలని చూస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కీలకంగా ఉన్న ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు, మరో సీనియర్ నేత దువ్వాడ శ్రీధర్ కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇలా సీదిరి తీరు నచ్చక.. నేతలంతా ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారనే గుసగుసలు పలాసలో జోరుగా వినిపిస్తున్నాయ్. పార్టీ కోసం కష్టపడే వారిని.. సీదిరి అప్పలరాజు కనీసం పట్టించుకోవడం లేదంటూ.. వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది.
వైసీపీలో కీలక నేతగా ఉన్న దువ్వాడ శ్రీధర్.. సీదిరికి వ్యతిరేకంగా ఓ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. పలాస ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. పలాసను జిల్లా చేయాలంటూ జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ.. మాజీమంత్రి సీదిరి అప్పలరాజుకు తలపోటుగా మారాయనే చర్చ జరుగుతోంది. అటు పార్టీ అసలే కష్ట కాలంలో ఉంది. ఇలాంటి సమయంలో నేతలంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో.. కేడర్ కూడా డీలా పడిపోతోందట. సీదిరి దూకుడు రాజకీయాలతో.. అసలుకే మోసం వస్తుందని.. కార్యకర్తలు వాళ్లలో వాళ్లు చర్చించుకున్నారని తెలుస్తోంది. పార్టీలో గ్రూప్‌ల గోల ఎక్కువ అయితే.. ఎన్నికల నాటికి మరింత ఇబ్బంది అవుతుందని.. అందరిని కలుపుకొని వెళ్లినప్పుడే రాజకీయంగా గౌతు కుటుంబాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుందని.. ఫ్యాన్ పార్టీలో మరికొందరు నేతలు సూచిస్తున్నారు.
Also Read: ఏపీ పేరు మార్పు అసలు సాధ్యమేనా? కూటమి సర్కార్ దీనికి సిద్ధంగా ఉందా?