Pawan Kalyan: కంచుకోటలో యంగ్ లీడర్లకు పగ్గాలు..! ఆ జిల్లాలపై పవన్ కల్యాణ్ స్పెషల్ కాన్సన్‌ట్రేషన్..

సామాజిక సమీకరణాలతో పాటు, ఈ సారి కొత్త ఇంచార్జ్‌ల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Updated on- May 12, 2026 / 12:33 AM IST

Pawan Kalyan: ఆ రెండు జిల్లాలు జనసేనకు పట్టుకొమ్మలు. ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంకు ఉన్నది అక్కడే. గత ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో సత్తా చాటింది. రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలవాలనే స్కెచ్‌తో అడుగులు వేస్తోంది జనసేన. అందుకే గోదారి గట్టునున్న ఆ జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు రెడీ అవుతన్నారట పవన్. పార్టీ యాక్టివిటీ స్పీడప్ చేయడం కోసం..చురుకైన నాయకత్వానికి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారట. పవన్ బ్యాక్ టు వర్క్..ఆ తర్వాత ఇంచార్జ్‌ల మార్పు పక్కానా? అధినేత మెప్పు కోసం ఆశావహులు ప్రయత్నాలు స్పీడప్ చేశారా?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సభ్యత్వ నమోదును స్పీడప్ చేసింది జనసేన పార్టీ. అయితే అనారోగ్యం, సర్జరీ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌..పార్టీ ఇంచార్జ్‌ల మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేనకు కంచుకోట లాంటి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గ ఇంచార్జ్‌ మార్పుపై పవన్ సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు టాక్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కనీసం ముగ్గురు కొత్త ముఖాలకు..ఈ సారి కొత్తగా ఇంచార్జ్‌లుగా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

పాత ఇంచార్జ్‌లను మార్చి కొత్త వారికి బాధ్యతలు..

ముఖ్యంగా గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో పాత ఇంచార్జ్‌లను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న సువర్ణరాజును తొలగించి మహిళా నేత ఫాతిమారాణికి అవకాశం ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మేక ఈశ్వరయ్యను తప్పించి ఓ ఎన్నారైకి ఇంచార్జ్‌ పోస్ట్‌ ఇస్తారని..ఆయన దూకుడుతో పార్టీని పటిష్టం చేసేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

పార్టీ కోసం కష్టపడ్డ వారికే బాధ్యతలు..

సామాజిక సమీకరణాలతో పాటు, ఈ సారి కొత్త ఇంచార్జ్‌ల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆచంట, తణుకు నియోజకవర్గాల్లోనూ కొత్త ఇంచార్జ్‌ల నియామకంపై జన సైనికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పనితీరు బాగున్న వారికే పట్టం కట్టాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇంచార్జ్‌ల మార్పునకు ప్రధానంగా రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారట. ఒకటి నియోజకవర్గంలో వారి పనితీరు, రెండోది సభ్యత్వ నమోదులో చూపిన చొరవ. ఎవరు పార్టీ కోసం కష్టపడి జనాల్లోకి వెళ్తున్నారో వారికే బాధ్యతలు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతుంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులను, ఇంచార్జ్‌ల మార్పు అవసరాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యంతో ఉన్నప్పటికీ, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఈ కూర్పుపై సీరియస్‌గా చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ప్రక్షాళన ద్వారా క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపి, క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే పవన్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ కొత్త ఇంచార్జ్‌ల జాబితాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణలోనూ ఏపీ ఫార్ములా..! పవర్‌లోకి రావడమే టార్గెట్‌గా మోదీ అడుగులు..