×
Ad

Koneti Adimulam: ఆప్షన్‌ లేదా? ఇక రివర్స్ గేరేనా? సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం దారెటు.. ఎందుకీ పరిస్థితి..

దూకుడుగా ముందుకు వెళ్తూ ఎమ్మెల్యే ఆదిమూలంకు అన్ని విధాలుగా చెక్ పెట్టి, ఆయనను ఒంటరి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారట.

Koneti Adimulam: పవర్‌లో ఉన్నప్పుడు ఎంత కేర్‌ ఫుల్‌గా ఉంటే అంత మంచిది. చిన్న తప్పు జరిగినా..అసలుకే ఎసరు వస్తుంది. సీనియారిటీ, సిన్సియారిటీ అన్నీ హుష్‌ కాకి. ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారట ఓ టీడీపీ ఎమ్మెల్యే. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే..రాసలీల వీడియోతో ఇరికిపోయిన ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడిందట. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి కూడా..తన మాట చెల్లుబాట కాక..సొంత పార్టీ నేతలెవరూ పట్టించుకోక..పవర్‌లో ఉండి కూడా కోరలు తీసేసిన పాములాగా అయిపోయి అయోమయంలో పడిపోయారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.? ఆయనకు వచ్చిన ఇబ్బందులేంటి.?

రాసలీల వీడియోతో ఇరికిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే..!

తిరుపతి జిల్లా సత్యవేడు పాలిటిక్స్‌ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాసలీల వీడియోతో ఇరికిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం పక్కన పెట్టి, శంకర్ రెడ్డి అనే కొత్త నేతను ఇంచార్జ్‌గా నియమించడంతో రగడ మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా.. తనకు సరైన ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఆదిమూలం గొడవ చేస్తున్నారు. తిరిగి తనకు పార్టీలో స్థానం దక్కదని డిసైడ్ అయిన ఆదిమూలం..ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట. మరోవైపు పార్టీ ఇంచార్జ్ శంకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతూ, నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట. టీడీపీ అంతర్గత కలహాలతో సత్యవేడు రాజకీయం రసవత్తరంగా మారింది.

రాసలీల వీడియో రూపంలో బ్యాడ్‌ లక్‌..!

కోనేటి ఆదిమూలం. సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో లాస్ట్‌ మూమెంట్‌లో టీడీపీ టికెట్‌ దక్కించుకుని సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొద్ది నెలలకే..రాసలీల వీడియో రూపంలో బ్యాడ్‌ లక్‌ ఆయన తలుపు తట్టింది. దీంతో సీఎం చంద్రబాబు ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినప్పటి నుంచి ఆదిమూలం తిరిగి టీడీపీకి దగ్గరయ్యేందుకు రకరకాల యత్నాలు చేశారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆదిమూలంను పట్టించుకోలేదు.

ఆదిమూలం రివర్స్ అటాక్..

లేటెస్ట్‌గా శంకర్ రెడ్డిని టీడీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌గా నియమించింది. గత కొన్నేళ్లుగా టీడీపీకి తెరవెనక సహాయ సహకారాలు అందిస్తున్న శంకర్ రెడ్డి ఇప్పుడు నేరుగా సీన్‌లోకి వచ్చారు. మరోవైపు తనకు పార్టీలోకి రీఎంట్రీ లేదని కన్ఫామ్‌ చేసుకున్న ఆదిమూలం..ఇక రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. పార్టీ ఇంచార్జ్ శంకర్ రెడ్డిపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన సత్యవేడులో శంకర్ రెడ్డికి ఏం పని అంటూ..విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఎమ్మెల్యే. తాను దళితుడిని అయినందు వల్లే అధికారులు గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటూ వాయిస్ రైజ్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఈ వివాదం క్రమంగా ముదురుతోంది.

నియోజకవర్గ ఇంచార్జ్‌గా వచ్చిన శంకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దూకుడుగా ముందుకు వెళ్తూ ఎమ్మెల్యే ఆదిమూలంకు అన్ని విధాలుగా చెక్ పెట్టి, ఆయనను ఒంటరి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారట. నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ మండలాల వారీగా కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆదిమూలంకు వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారు. అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సత్యవేడులో మళ్లీ పార్టీని గాడిన పెట్టే పనిలో ఉన్నారు.

మరోవైపు నియోజకవర్గంలోని ఎస్సీ నాయకులంతా ఇటీవల తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదిమూలం వ్యవహారాన్ని ఎండగట్టడం సంచలనంగా మారింది. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని, తమ నాయకుడు శంకర్ రెడ్డి మాత్రమే అని ఎస్సీ నాయకులు గట్టిగా తెగేసి చెబుతున్నారు. దళిత కార్డుతో శంకర్ రెడ్డిని ఇరుకున పెట్టాలని చూడటం తగదని ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆయన సొంత సామాజికవర్గం బాణాలు ఎక్కుపెడుతోంది.

వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆదిమూలం తమను ఇలానే ఇబ్బందులు పెట్టేవారని, టీడీపీలోకి వచ్చాక కూడా ఆయన వైఖరిలో మార్పు రాలేదని తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడికి దిగారు. ఇలా సైకిల్‌ పార్టీలో సరికొత్త పొలిటికల్‌ గేమ్‌..సత్యవేడు పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఆదిమూలం రియాక్షన్ ఎలా ఉంటుందో..టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారానికి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

Also Read: కాకినాడ జిల్లా టీడీపీ బాస్ ఎవరు? ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?