రసవత్తరంగా విశాఖ ఎమ్మెల్సీ పోరు.. బొత్సను ఓడించడమే టార్గెట్‌గా కూటమి పార్టీల పావులు

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్‌గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున్నారు.

Gossip Garage : విశాఖ ఎమ్మెల్సీ ఫైట్ రసవత్తరంగా మారుతోంది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా… రంగంలోకి దిగాలని కూటమి పార్టీలు డిసైడ్ అవ్వడంతో పసందైన రాజకీయానికి తెరలేచినట్లైంది. కేవలంలో 838 ఓట్లు ఉన్న ఈ ఎన్నిక… రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కాపాడుకోడానికి వైసీపీ…. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన జైత్రయాత్ర కొనసాగించాలని కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స డిసైడవ్వగా, కూటమి నుంచి ఐదుగురు నేతలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఐదుగురిలో సీఎం చంద్రబాబుకు ఎవరి పేరు టిక్కు పెట్టినా.. గెలుపు బాధ్యతను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీసుకోవడంతో విశాఖ కేంద్రంగా పొలిటికల్ హైటెన్షన్ పెరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలాబలాల్లో మార్పు..
విశాఖ కేంద్రంగా మరో హోరాహోరీ పోరుకు తెరలేచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడం… తమ సిట్టింగ్ స్థానంలో మరోసారి జెండా ఎగరేయాలనే లక్ష్యంతో ప్రతిపక్షం వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ స్థానానికి తగిన అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ప్రకటించింది వైసీసీ అధిష్టానం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లుగా మొత్తం 838 మంది నమోదయ్యారు. వీరిలో 636 మంది ఎంపీటీసీ సభ్యులు, 36 మంది జడ్పీటీసీ సభ్యులు, 97 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు, 28 మంది నర్సీపట్నం కౌన్సిలర్లు, 25 మంది ఎలమంచిలి కౌన్సిలర్లు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్అఫీసియో సభ్యులుగా ఓటు వేస్తారు. ఐతే మొత్తం 838 ఓట్లలో వైసీపీకే మెజార్టీ ఓట్లు ఉన్నాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ బలాబలాల్లో మార్పు వచ్చిందంటున్నారు. దీంతో కూటమి పార్టీలు తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని డిసైడ్‌ అయ్యాయి. ఆగస్టు 30న ఎన్నిక జరగనుండటం.. ఈలోగా బలం పెంచుకోవాలని కూటమి పావులు కదుపుతుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.

బొత్సను చట్టసభల్లో అడుగు పెట్టనీయకూడదని చంద్రబాబు పంతం..!
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్‌గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు బలమైన నేతలు ఉండటం వారంతా వ్యక్తిగతంగా తమ ప్రతిష్ఠకు పరీక్షగా భావిస్తున్నారని అంటున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వంటి హేమాహేమీలు కూటమి అభ్యర్థి గెలుపు బాధ్యతలు తమ భుజస్కందాలపై వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా వైసీపీ అభ్యర్థి బొత్సను చట్టసభల్లో అడుగు పెట్టనీయకూడదని సీఎం చంద్రబాబు పంతంగా పెట్టుకోవడంతో కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయడానికైనా వెనుకాడొద్దని కూటమి నేతలు తీర్మానించుకున్నట్లు చెబుతున్నారు.

బొత్స గెలుపుని సవాల్ గా తీసుకున్న జగన్..
మరోవైపు వైసీపీ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తున్న బొత్స… ఒకవైపు విజయనగరం, విశాఖపట్నం నేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు మాజీ సీఎం జగన్‌ కూడా ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకుని… పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఎన్నిక బాధ్యతను అప్పగించారు. దీంతో ఇరు పార్టీల్లో బడా లీడర్లు అంతా ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వారిని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

ఎంపీటీసీ సభ్యులపై టీడీపీ ఫోకస్..
వాస్తవానికి విశాఖ స్థానిక సంస్థల స్థానంలో టీడీపీ కూటమికి పెద్దగా బలం లేదు. ఈ కారణంతో గతంలో జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐతే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా 838 ఓట్లు ఉంటే అత్యధికంగా ఓట్లు ఉన్న ఎంపీటీసీ సభ్యులపై టీడీపీ ఫోకస్ చేసింది. ఇదే సమయంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో కొనసాగేకన్నా, ఇదే అవకాశంగా భావిస్తున్న ఓటర్లు టీడీపీ లేదా జనసేనల్లో ఏదో ఒక పార్టీని ఎంచుకుంటున్నారు. ఇలా కూటమిపై సానుకూలంగా ఉన్న వారిని గుర్తించి క్యాంపులకు తరలించాలని అధికార పక్ష నేతలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ బాధ్యతలను మాజీ మంత్రి గంటా, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు అప్పగించారంటున్నారు. గ్రామస్థాయి నేతలను ఆకర్షించడంలో ఇద్దరూ దిట్టగా చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో గంటాకు, అనకాపల్లి ప్రాంతంలో సీఎం రమేశ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వీరికి ఎమ్మెల్యేలు సహకరించాలని నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో బొత్సకు దీటుగా కూటమి నుంచి బడా లీడర్లు రంగంలోకి దిగడంతో ఎమ్మెల్సీ వార్ హైటెన్షన్‌గా మారింది. ఇక సామాజిక సమీకరణాలు కూటమికే అడ్వాంటేజ్‌గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ అభ్యర్థి బొత్స…. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కాగా, ఆ సామాజిక వర్గానికి విశాఖ జిల్లాలో మాత్రమే ఓట్లు ఉన్నాయి. అవీ పరిమిత సంఖ్యలోనే అని చెబుతున్నారు. ఇక కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగినా… సామాజికంగానూ పైచేయి సాధించొచ్చనే ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి విశాఖ పోరు ఉత్కంఠగా మారుతోంది.

Also Read : దారుణ ఓటమితో రోజా సంచలన నిర్ణయం? ఏపీ రాజకీయాలకు గుడ్‌బై, తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ?

ట్రెండింగ్ వార్తలు