Gossip Garage : జగన్‌ వ్యూహం ఫలించలేదా? కడప మేయర్‌ పీఠం కూటమి కైవసం చేసుకోబోతోందా?

Ys Jagan Mohan Reddy

Gossip Garage : పరువు కోసం ఒకరు..పట్టు కోసం మరొకరు..కడప గడపలో మేయర్‌ పీఠం మీద ఫోకస్ పెట్టారు. ఏది ఏమైనా అక్కడ పాగా వేయాలనే ప్రయత్నం టీడీపీది. అపోజిషన్‌లో ఉన్నా పీఠం తమదే కావాలనే కసి వైసీపీది. ఒక్కొక్కరికి గాలం వేస్తూ సొంతగడ్డ మీద జగన్‌కు షాక్ ఇవ్వాలని సైకిల్ పార్టీ ప్లాన్ చేస్తుంటే.. కార్పొరేటర్లను బుజ్జగించే ప్రయత్నంలో వైసీపీ ఉంది. తమ గోడు వెళ్లబోసుకుందామని అధినేత దగ్గరికి వెళ్తే..జగన్‌ ఇచ్చిన షాక్‌తో తమ దారి తాము చేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు. ఇంతకీ వైసీపీ.. కార్పొరేటర్లను కాపాడుకోగలుగుతుందా.? కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ చేజక్కించుకుంటుందా.?

టీడీపీ వరుస ఆపరేషన్స్‌..
పట్టుబట్టి వైసీపీని ఘోరంగా ఓడించిన టీడీపీ..ఇప్పుడు..మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లాలోనే పొలిటికల్ గేమ్‌ స్టార్ట్ చేసింది. కడప జిల్లా అంటేనే జగన్‌కు, వైసీపీకి అడ్డా. కానీ గత ఎన్నికల్లో కూటమి దెబ్బకు ఫ్యాన్ పార్టీ బొక్క బోర్లా పడింది. ఇప్పుడేమో అదే అడ్డాలో మరోమారు ఫ్యాన్ గాలి వీయకుండా సైకిల్ పార్టీ రంగంలోకి దిగింది. కడప మున్సిపల్ కార్పొరేషన్‌ పీఠంపై గురి పెట్టిన టీడీపీ వరుస ఆపరేషన్స్‌ చేస్తోంది. ఒక్కొ కార్పొరేటర్‌ను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

టీడీపీకి మరింత అనుకూలంగా మారిన జగన్ కడప పర్యటన..
ఈ టైమ్‌లో కడపలో జగన్ పర్యటన టీడీపీకి మరింత అనుకూలంగా మారింది. అధినేత రాకతో కార్పొరేటర్లు లైన్‌లోకి వస్తారని వైసీపీ నేతలు ఊహిస్తే సైడ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బాస్‌తో తమ మనసులో మాట చెప్పాలని గంపెడు ఆశలు పెట్టుకున్నారు కార్పొరేటర్లు. ముందు నుంచి కడప మేయర్ సురేశ్ బాబుపై ఆగ్రహంతో ఉన్న కార్పొరేటర్లు..తమ అసంతృప్తిని అధినేతకు తెలియజేయాలనుకున్నారట. ఈ నేపథ్యంలో ఇడుపులపాయకు వచ్చిన జగన్‌ను కలిశారు.

అయితే ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతారని ఊహిస్తే గుంపులో గోవిందా అన్నట్లుగా అందరితో ఒకేసారి మీటింగ్ ముగించేశారట జగన్. సమావేశంలో కూడా కార్పొరేటర్లు వెర్షన్ ఏంటో వినలేదట. మీ బాధ్యత మొత్తం మేయర్‌ సురేశ్‌బాబు, అవినాశ్‌దని చెప్పి..భేటీని కంప్లీట్ చేశారట. కడపలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలపై అధినేతకు చెప్పే ఛాన్స్ దొరక్కపోవడంతో డీలా పడిపోయారట కార్పొరేటర్లు.

Also Read : కూటమి నేతలకు సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్‌..! ఆ లక్కీ చాన్స్ ఎవరికి?

మీటింగ్ నుంచి బయటకు రాగానే జగన్ హామీతో ఏకీభవించని కార్పొరేటర్లు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారట. ఇప్పటికే ఎనిమిది మంది కార్పొరేటర్లు సైకిలెక్కారు. మొన్నా మధ్య కార్పొరేషన్‌లో గొడవ జరిగిన రోజే ఫ్యాన్ పార్టీకి తొందరలో మరో ఝలక్ అంటూ సైకిల్ పార్టీ నుంచి సవాల్ ఎదురైంది. అధికార టీడీపీ నుంచి వచ్చే ఆఫర్లకు ఓకే చెప్పేందుకు కార్పొరేటర్లు కూడా రెడీ అయ్యారన్న ప్రచారం జోరందుకుంది.

మేయర్‌ పీఠం చేజారే ప్రమాదం..
ఇదే జరిగితే రాబోయే రోజుల్లో మరో పది పదిహేను మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్యాన్ స్విచ్ మాత్రమే ఆన్‌లో ఉంటుంది.. ఫ్యాన్ మాత్రం తిరగదన్న పరిస్థితి వచ్చేలా ఉంది. మొన్నటి ఎన్నికల్లో జగన్‌ సొంత ఇలాఖలో పార్టీ ఓటమి బాధను మర్చిపోకముందే..ఇప్పుడు మేయర్‌ పీఠం చేజారే ప్రమాదం ఉంది.

ఇడుపులపాయలో జగన్‌తో భేటీ తర్వాత కార్పొరేటర్లకు మరింత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తామంతా మేయర్ సురేశ్‌బాబును వ్యతిరేకిస్తుంటే..తమ వాదన ఏంటో వినకుండా..మేయర్‌ను ఏమనకుండా..ఆయనకే సపోర్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారట కార్పొరేటర్లు. అలాంటప్పుడు టీడీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని..జంప్ అయితేనే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చారట. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను బుజ్జగించేందుకు జగన్‌ వేసిన వ్యూహం ఫెయిల్ అయిందన్న చర్చ జరుగుతోంది.

మేయర్‌పై ఫిర్యాదులను వినకుండా.. జగన్‌ ఒక్క మాటలో తేల్చేయడంతో..అధినేతకు నమస్తే చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారట కార్పొరేటర్లు. దాంతో సైకిల్ పార్టీ గాలానికి మరో విడత కార్పొరేటర్ల జంపింగ్ ఖాయమేనన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప గడపలో సెగలు పుట్టిస్తున్న కార్పొరేషన్ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయోనన్న ఆసక్తి అయితే కొనసాగుతోంది.

 

Also Read : వైసీపీని వీడి బీజేపీలో చేరిన ఆడారి ఆనంద్.. జగన్ పార్టీకి మరో ఆయుధం దొరికినట్లేనా?