Gossip Garage: రెండు కీలక కేసులు. వాటి చుట్టే రచ్చ. తిరుమల శ్రీవారి కొండంత రాజకీయం. అటు పరకామణి చోరీ కేసు..ఇటు కల్తీ నెయ్యి ఇష్యూ..రెండూ పీక్ లెవల్‌కు చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు పరకామణి వివాదం రచ్చకెక్కితే..ఎలక్షన్ అయిపోయాక కల్తీ నెయ్యి ఎపిసోడ్ కాక రేపుతూ వస్తోంది. ఫైనల్‌గా రెండు కీలక కేసుల్లో దర్యాప్తు నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటోంది. పరకామణి చోరీ కేసు జఠిలం అవుతోందా? కల్తీ నెయ్యి కేసు లాస్ట్ స్టేజ్‌లో ఉందా? ఈ రెండు కేసుల్లో ఆ ఇద్దరే టార్గెట్టా?
రెండు కీలక కేసుల చుట్టూ కొండంత వివాదం అవుతోంది. అసలే కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల శ్రీవారికి సంబంధించిన ఇష్యూస్. ఒకటి పరకామణి చోరీ కేసు. రెండోది కల్తీ నెయ్యి ఘటన. పరకామణి చోరీ కేసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పెద్ద వివాదం అయింది. అప్పుట్లో అది సెటిల్ అయినా లేటెస్ట్‌గా మూడు నెలల నుంచి పెద్ద చర్చగా కొనసాగుతోంది. పరకామణి చోరీ చేసిన వ్యక్తి ఆస్తుల జప్తు..అతని ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు ఇలా రోజుకో డెవలప్‌మెంట్ జరుగుతుండగానే..సాక్షి సీఐ సతీష్ మృతి చెందడంతో కేసు కొత్త టర్న్ తీసుకున్నట్లు అయింది.
అటు సతీష్‌ది ఆత్మహత్య అని వైసీపీ..హత్య అని టీడీపీ డైలాగ్ వార్‌కు దిగుతున్నాయి. టీడీపీ ఓ అడుగు ముందుకేసి వైసీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డే..సతీష్‌ను చంపించారని కూడా ఆరోపిస్తోంది. ఇంకా పోలీస్ దర్యాప్తు కొనసాగుతుండగానే..సతీష్ డెత్ మిస్టరీ చుట్టూ రాజకీయం రంకెళ్లు వేస్తోంది.
మరోవైపు పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో..ఈ కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్ష్యులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే వైసీపీ నేత భూమన కరుణాకరెడ్డి టార్గెట్‌గానే పరకామణి కేసు కొనసాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..టీటీడీ పనితీరు బాలేదంటూ పదేపదే మీడియా ముందు వాలిపోతూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గోశాల, విష్ణుమూర్తి విగ్రహం ఇష్యూలో భూమన టీటీడీపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఆ తర్వాత ఆయనపై కేసులు, నోటీసులు, విచారణ అంటూ హడావుడి నడిచింది.
అయితే భూమన ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే పరకామణి కేసును ప్రైవేటు సెటిల్‌మెంట్ చేశారని..నిందితుడు రవికుమార్ ఆస్తుల విషయంలో ఏదో గోల్‌మాల్ ఉందన్న ఆరోపణలు వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలోనే సతీష్‌ది ఆత్మహత్య అంటూ భూమన చేసిన వ్యాఖ్యలను కూడా టీడీపీ అస్త్రంగా వాడుకుంటుంది. సతీష్‌ది హత్యా? ఆత్మహత్యా? లేక ఆకస్మిక మరణమా అని పోలీసులు తేల్చకముందే ఆత్మహత్య అని భూమన ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నిస్తోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా పరకామణి కేసుపై రియాక్ట్ అయ్యారు. పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా ఇప్పటికీ తీవ్ర దుమారం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి కేసు ఇప్పటికీ కాక రేపుతోంది. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్ అయ్యాడు. ఆయనను కస్టడీకి తీసుకుని సిట్ విచారించింది. వైవీతో సంబంధం ఎలా ఏర్పడింది? తిరుమల వ్యవహారాలతో మీకేం పని? అంటూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అప్పన్న బ్యాంకు ఖాతాలో రూ. 4.69 కోట్లు ఎలా జమయ్యాయని ప్రశ్నించినట్లు టాక్.
తిరుమలకు నెయ్యి సప్లై..ఆర్డర్స్..వాటితో వైవీ సుబ్బారెడ్డికి ఏమైనా ప్రమేయం ఉందా అని కూపీ లాగారాట. ఇక ఇప్పటికే అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. ఈ క్రమంలోనే వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. అనారోగ్యంగా ఉన్నట్లు వైవీ.. అధికారులకు ఇన్ఫామ్ చేయడంతో..సిట్ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికే వెళ్లి విచారించాలని నిర్ణయించారు.
ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఇంటికే వస్తామని, విచారణకు రెడీగా ఉండాలని ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20న జరిగే సిట్ విచారణలో వైవీ సుబ్బారెడ్డి చెప్పబోయే విషయాలు కల్తీ లడ్డూ కేసుకు కీలకంగా మారనున్నాయి.
ఈ నేపథ్యంలో సిట్ విచారణలో వైవీ సుబ్బారెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఆయన పీఏ చెప్పిన విషయాలపై సిట్ ఎలాంటి ప్రశ్నలు వేయనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్ విచారణలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉందని తేలితే మాత్రం ఈ కేసులో సంచలనాలు పక్కా. కల్తీ నెయ్యి వివాదంపై ఇప్పటికే కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది.
అయితే అటు పరకామణి కేసులో భూమన..ఇటు కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి అలిగేషన్స్ ఎదుర్కొంటుండటం వైసీపీకి హెడెక్‌గా మారింది. పైగా ఈ ఇద్దరు నేతలు వైసీపీ అధినేతకు జగన్‌కు సన్నిహితులు. వైవీ సుబ్బారెడ్డి అయితే జగన్‌కు బాబాయ్ అవుతారు. ఈ ఇద్దరిని కార్నర్ చేసి..జగన్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కూటమి స్కెచ్ వేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. పరకామణి కేసు..ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉంటాయో చూడాలి.
Also Read: సైలెంట్ మోడ్.. జగన్ కంచుకోటలో నేతల మౌనరాగమెందుకు? క్యాడర్ పరిస్థితి ఏంటి?