ఫలానా పదవి కావాలంటూ రాజకీయ నేతలు తమ పార్టీ అధిష్టానాన్ని పట్టుబట్టడం కామన్. కానీ నీకో పోస్ట్ ఇస్తా అంటే వద్దు బాబోయ్ అనడం చాలా రేర్. విశాఖ వైసీపీలో ఇలాంటి సీనే కనిపిస్తోంది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటే ఏ నేత ముందుకు రావడం లేదట. నేతలు ఇంతలా వెనకడుగు వేయడానికి విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి స్ట్రాంగ్ నెగిటివ్ సెంటిమెంట్ నడుస్తోంది.
ఈ పదవి చేపట్టినవారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఖాయమన్న టాక్ ఉంది. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇదే సెంటిమెంట్ నడుస్తోంది. వైసీపీ ఆవిర్భవించిన మొదట్లో నాడు అధ్యక్షుడిగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ మొదలుకుని, ప్రస్తుత అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ వరకు ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. విశాఖ వైసీపీ అధ్యక్షుడుగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంట్లో కూర్చోవడం పక్కా అన్న చర్చ జరుగుతోంది.
విశాఖ అర్బన్ అధ్యక్షుడుగా సుదీర్ఘకాలం వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు. తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటు దక్కలేదు. మేయర్ పీఠం దక్కుతుందనుకున్నా ఆఖరి నిమిషంలో నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కినా..వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోయారు వంశీకృష్ణ.
లాస్ట్ మినిట్‌లో ఝలక్
ఇక మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుది సేమ్ సీన్. పెందుర్తి టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆయనకు పార్టీ లాస్ట్ మినిట్‌లో ఝలక్ ఇచ్చింది. ఆయన కూడా వైసీపీని వీడి జనసేనలో చేరిపోయి పెందుర్తి ఎమ్మెల్యే అయ్యారు. ఇక గతంలో విశాఖ నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ వ్యాపార అక్రమాలు వెలుగు చూడటంతో జైలుకు వెళ్లి వచ్చారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా జిల్లా అధ్యక్ష పీఠం బాధితుడే. ఆయన హయాంలో గ్రేటర్ విశాఖ పరిధిలో జోష్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి. రాజకీయంగా ఓటమి అంటే ఎరుగని అవంతికి తొలిసారి ఘోరమైన అనుభవం తప్పలేదు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు సైలెంట్ ఉన్న అవంతి ఇటీవలే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
అలాగే ఎమ్మెల్యేగా గెలుపు దగ్గరకు వచ్చి ఓడిపోతున్న కోలాగువురులుది ఇదే పరిస్థితి. 2014లో వైసీపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు. ఎమ్మెల్సీగానైనా సరే చట్టసభలో అడుగుపెట్టాలనే కోలా గురువులు ఆశ ఒక్క ఓటుతో తేడాతో ఓడి కనుమరుగైపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చింది అధిష్టానం. చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉండటంతో..విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి మరొకరిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అధిష్టానం కూడా ఆలోచనలో పడిందా?
విశాఖ వైసీపీ పగ్గాలను ఎవరికి కట్టబెట్టాలనే దానిపై అధిష్టానం కూడా ఆలోచనలో పడిందట. అంతో ఎంతో నేమ్, ఫేమ్ లీడర్లు ఎవరూ సెంటిమెంట్ భయంతో ముందుడుగు వేయడం లేదు. విశాఖ నార్త్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న కేకే రాజు పేరును పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నా, ఆయన కూడా సుముఖంగా లేరట. గతంలో పనిచేసిన మళ్ల విజయ్ ప్రసాద్ కోర్టు కేసులతో జైలుకు వెళ్లి వచ్చినా సరే కొద్దిరోజులు నడిపిద్దామంటే ఆయన పరిస్థితి మరీ దయనీయంగా ఉందట.
అలాగే విశాఖ సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేశ్ కుమార్‌కు గతంలో టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తామంటే తన వ్యాపారాలకు కూటమి పార్టీల నుంచి ముప్పు ఉంటుందని ఆయన తప్పించుకుంటున్నారట. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు కూడా తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారట.
రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా విశాఖ పార్టీ పగ్గాలు ఇస్తామంటే నేతలంతా ఎవరికివారు ఏదో ఒక సాకు చెబుతున్నారట. కానీ అందరికీ లోలోన సెంటిమెంట్ భయమే ఎక్కువగా ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేరుగా సెంటిమెంట్‌ను సాకుగా చూపితే పార్టీలో అసలుకే ఎసరు వస్తుందనే భయంతో రకరకాల కారణాలను చూపుతున్నారట. అందరినీ వణికిస్తున్నది మాత్రం ఆ పదవికి ఉన్న నెగిటివ్ సెంట్‌మెంటేనని చర్చించుకుంటున్నారు నేతలు. పార్టీ పెద్దలు ఈ సెంటిమెంట్‌ను తిరగరాసే పవర్ ఫుల్ లీడర్‌ను తీసుకొస్తారా.. అదెప్పుడు అనేది వేచి చూడాల్సిందే.