AP Rains: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. 3 రోజులు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల రైతులు, ప్రజలు జాగ్రత్త
ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Representative Image (Image Credit To Original Source)
- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
- రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు..!
- పంటలు తడవకుండా రైతులు భద్రపరుచుకోవాలి
- వర్షం సమయంలో చెట్ల కింద, పంట పొలాల్లో ఉండరాదు
AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. మూడు రోజులు వానలు కురవనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ రాత్రికి కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంది. ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే చాన్స్ ఉందని అంచనా వేసింది.
అకాల వర్షాల నేపథ్యంలో మినుము, మిరప, పసుపు ఇతర పంటలు తడవకుండా భద్రపరుచుకోవాలి రైతులకు సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద ఉండరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ జాగ్రత్తలు చెప్పారు. ఆ సమయంలో సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలన్నారు.
”ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉంది. రైతాంగం అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలి. మినుము, మిరప, పసుపు, ఆరబెట్టిన ఇతర పంటలు తడవకుండా జాగ్రత్త పరుచుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, పొలాల్లో ఉండరాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలి” అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
రానున్న మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం..
శుక్రవారం (20-03-26) : రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
శనివారం (21-03-26) : శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే చాన్స్.
మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
ఆదివారం(22-03-26): శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.
మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం.
