రుషికొండ ప్యాలెస్‌పై అసెంబ్లీలో చర్చ వెనుక సీఎం చంద్రబాబు భారీ స్కెచ్..!

ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్‌ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్‌... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.

Gossip Garage : ఆ కమోడ్‌ చూశారా? దాని ధర ఎంతో తెలుసా..? లక్షల రూపాయలట… నేనెప్పుడు అంత ఖరీదైన బాత్‌రూమ్‌ చూడలేదు…? మనమే కాదు.. ప్రజలు కూడా చూడలేదు.. కమోడే కాదు అక్కడి భవనాలను పబ్లిక్‌ చూడాలి… టికెట్‌ ఎంత పెడతామంటారు.. ఓ 50 రూపాయలు పెడితే బాగుంటుంది.. మరీ అంత కాస్ట్‌ పెట్టి ప్రజలు చూడగలరు అనుకుంటున్నారా? ఏంటీ బాత్‌రూమ్‌ బాతాఖానీ అనుకుంటున్నారా? అదేనండి రుషికొండ ప్యాలెస్‌పై ప్రభుత్వాధినేతలు, శాసనసభ్యలు అసెంబ్లీ వేదికగా జరిపిన చర్చే ఇదంతా… ఏదో సెటైరిక్‌గా వారు అలా మాట్లాడారనుకుంటున్నారా? ఏంటి… ఆ మాటల వెనుక పెద్ద స్కెచ్చే ఉందట…!

మాజీ సీఎం జగన్‌ పరువును గోదాట్లో కలిపేయాలనేది స్కెచ్‌..
ఔను… రుషికొండ ప్యాలెస్‌నే అస్త్రంగా చేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వాధినేత చంద్రబాబు… డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి టార్గెట్‌ ఒక్కటే… గత ప్రభుత్వం అత్యంత రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాల గుట్టు విప్పి… మాజీ సీఎం జగన్‌ పరువును గోదాట్లో కలిపేయాలనేది స్కెచ్‌. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నుంచి రుషికొండపై ప్రజల్లో చర్చ జరిగేలా పావులు కదుపుతున్నారు. తొలిసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పంపి… రుషికొండ ప్యాలెస్‌ను ప్రపంచానికి చూపించారు. ఆ తర్వాత వైసీపీ నేతలు డిఫెన్స్‌లో పడినా… నిను వదల బొమ్మాళి అన్నట్లు… రుషికొండ ప్యాలెస్‌ ద్వారా వైసీపీని మరింత డ్యామేజ్‌ చేసేలా అడుగులు వేస్తున్నారు.

ప్రజాధనం వృథా చేశారనే కోణం ఆవిష్కరణ..
500 కోట్లు పెట్టి అత్యంత విలాస వంతమైన భవనాలు నిర్మించారట…. సువిశాల కొండపై ఐదు భవనాలు ఉండగా, జగన్‌ కోసం అధునాతన భవనాలు… ఆయన కుటుంబ సభ్యులు కోసం మరో రెండు భవనాలు… ఇంకా పనివారి కోసం మరో రెండు భవనాలు నిర్మించారని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం తాజాగా… ఆ ప్యాలెస్‌లో విలువైన సౌకర్యాలను ప్రజలకు చూపిస్తామనే సంకేతాలు పంపుతోందంటున్నారు. రుషికొండ ప్యాలెస్‌లో బాత్‌టబ్‌కే 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెబుతున్న ప్రభుత్వం.. ఆ భవనాలను ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నామని చెప్పడం ద్వారా… ప్రజాధనం వృథా చేశారనే కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

రుషికొండ ప్యాలెస్‌ వివాదం.. ఆత్మరక్షణలో వైసీపీ..
వాస్తవానికి రుషికొండ ప్యాలెస్‌పై వైసీపీ ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా…. రుషికొండపై నిర్మాణాలను అత్యంత రహస్యంగా చేపట్టింది. కొండను తొలిచి తొలుత వివాదానికి ఆజ్యం పోసిన వైసీపీ ప్రభుత్వం… కొండకు గ్రీన్‌మ్యాట్‌ కప్పి చట్టాల కళ్లు గప్పే ప్రయత్నం చేసినట్లు విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత భవనాలు ఎందుకు నిర్మిస్తున్నది చెప్పకుండా…. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది. ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ వ్యక్తిగత అవసరాల కోసం భవనాలు నిర్మిస్తున్నారని టీడీపీ, జనసేన విమర్శిస్తే… కౌంటర్‌ ఇవ్వలేక చేతులెత్తేసిందంటున్నారు.

అసెంబ్లీ వేదికగా వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు..
ఇక అధికారం కోల్పోయాక టీడీపీ ప్రభుత్వం ముందుగా రుషికొండ రహస్యాన్ని బద్దలు కొడితే… ప్రధాని, రాష్ట్రపతి వంటి ముఖ్యుల కోసం అతిథి భవనాలు నిర్మించామని చెప్పుకునే ప్రయత్నం చేసింది… ఈ వాదనకు ప్రజా మద్దతు లభించకపోవడంతో… అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ భవనాలు నిర్మించాం.. ఆ భవనాలను ఏం చేయాలో ప్రభుత్వంలో ఉన్నవారు నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పడం ద్వారా వైసీపీయే ప్రభుత్వానికి ఆయుధమిచ్చిందని చెబుతున్నారు. వైసీపీ చెప్పిన మాటలనే అస్త్రాలు చేసుకున్న అధికార పక్షం…. రుషికొండ భవనాలను ఏం చేద్దామన్న చర్చకు తెరతీసింది. అసెంబ్లీ వేదికగానే ఈ చర్చ మొదలుపెట్టి వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

భవిష్యత్‌లోనూ కొనసాగనున్న మాస్ ర్యాగింగ్..
విలువైన భవనాలు వృథాగా ఉన్నాయంటూ చర్చను తెరపైకి తెచ్చిన ఎమ్మెల్యేలు…. ఆ భవనాలను టాటాకు అద్దెకివ్వాలని కొందరంటే… ఫలక్‌నుమా ప్యాలెస్‌లా వాడుకోవాలి మరికొందరు శ్రుతికలపడం ఆసక్తికరంగా మారింది. సెవన్‌స్టార్‌… నైన్‌స్టార్‌ హోటల్‌గా మార్చేద్దామని కొందరు… పర్యాటక ప్రదేశంగా మార్చితే ఎలా ఉంటుందని ఇంకొందరు సెటైర్లు వేస్తూ రక్తి కట్టించారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ మాస్‌ ర్యాగింగ్‌ భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని చెప్పేలా…. సమావేశాలు ముగిశాక… ఎమ్మెల్యేలతో కలిసి సందర్శిద్దామని సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం ద్వారా… రుషికొండ ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఎండ్‌ కార్డు పడదని చెప్పేశారు.

వైసీపీని, జగన్‌ను తలెత్తుకోకుండా చేయాలనే విధంగా పావులు..
మొత్తానికి ప్రభుత్వం రుషికొండ ద్వారా వైసీపీని… మాజీ సీఎం జగన్‌ను తలెత్తుకోకుండా చేయాలనే విధంగానే పావులు కదుపుతోందంటున్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనకు ఉంచాలని ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం… నిజంగా అంతపనీ చేస్తే… రాజకీయంగా వైసీపీని ఇరకాటంలోకి నెట్టినట్లే భావించాల్సి వుంటుందని అంటున్నారు. ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్‌ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్‌… కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.

Also Read : వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఆ ఇద్దరు కీలక నేతలు?

ట్రెండింగ్ వార్తలు