×
Ad

Janasena: గోదావరి గట్టున నడిపించే నాయకుడు కావాలి.. ఆ రెండు సెగ్మెంట్లలో జనసైనికుల ఎదురుచూపు..!

వరద సాయం కోసం విరాళాలు సేకరించి..రూ.18 లక్షల విలువైన బియ్యం బస్తాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇంచార్జ్‌ను మారిస్తే గాని పార్టీ బలపడదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట జనసైనికులు.

  • Published On : February 7, 2026 / 06:00 AM IST

Janasena Representative Image (Image Credit To Original Source)

  • ఆ రెండు రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్లలో జనసేన లీడర్ల దూకుడేది?
  • గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో నేతల తలోదారి..
  • ఆ రెండు చోట్ల జనసేనలో అనిశ్చితికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడు?

 

Janasena: జనసేనకు గట్టి పట్టున్నది అక్కడే. గోదావరి జిల్లాల్లోనే ఆ పార్టీ బలమైన పునాదులు ఉన్నాయి. కానీ ఆ రెండు రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్లలో మాత్రం..సేనలో దూకుడు తగ్గిందట. నియోజకవర్గంలో ఇంచార్జ్‌లు ఉన్నామంటే ఉన్నామనేలా సైలెంట్‌ మోడ్‌లో ఉంటున్నారట. నడిపించే నాయకుడు లేక క్యాడర్ డైలమాలో పడిపోయిందట. ఆ కీలక మంత్రి ఆ సెగ్మెంట్లపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు? లోకల్‌ బాడీ ఎన్నికల వరకైనా క్యాడర్‌లో లీడర్లు జోష్ నింపుతారా?

రాష్ట్రమంతా జోరు. ఆ రెండు నియోజకవర్గాల్లో బేజారు అన్నట్లు ఉందట జనసేన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో.. జనసేన ఉనికి కూడా ఉండదేమో అన్న డౌట్స్‌ జనసైనికుల నుంచే వ్యక్తం అవుతుండటం చర్చనీయాంశంగా మారాయి. నేతల మధ్య బేధాభిప్రాయాలు, ఇంచార్జ్‌ నేతలపై అవినీతి ఆరోపణలతో పార్టీ బలపడటమేమో గాని ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయట. కొవ్వూరు, గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా..ఆ రెండు నియోజకవర్గాల జనసేన ఇంచార్జ్‌లు పార్టీ పటిష్టత కోసం ఏ మాత్రం ప్రయత్నాలు చేయడం లేదంటూ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

కార్యకర్తలు ఎంత తపన పడుతున్నా, లీడర్లు చేస్తున్న మిస్టేక్స్‌ పార్టీకి బ్యాడ్ నేమ్ తెస్తున్నాయట. స్థానిక ఎన్నికల్లో అయినా పార్టీ పరువు నిలబెట్టుకోవాలని జెండా మోసిన కార్యకర్తలు ఉవ్విళ్లూరుతుంటే, వలస నేతల పెత్తనంతో జనసైనికులు, వీర మహిళలు విసుగెత్తిపోతున్నారట. దీనంతటికీ కారణం ఏంటని, పార్టీ పెద్దలు గోపాలపురం నియోజకవర్గంపై ఆరా తీశారట. ఇక్కడున్న పరిస్థితులకు ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేయడం కరెక్టంటూ అధిష్టానానికి సూచనలు కూడా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

రూ.18 లక్షల విలువైన బియ్యం బస్తాలు పక్కదారి..

గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌గా ఉన్న దొడ్డిగర్ల సువర్ణరాజుపై అనేక అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ సువర్ణరాజుతో సంబంధం లేకుండానే కొందరు నాయకులు మండలాలు, గ్రామ కమిటీలు వేసేసుకుంటున్నారట. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లుగా ఉందట గోపాలపురం జనసైనికుల తీరు. క్యాడర్ అంతా తలో దిక్కు వెళ్లిపోవడంతో..గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ బలపడగలదా అని జనసైనికులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఇంచార్జ్‌ సువర్ణరాజు బుడమేర వరద సాయం కోసం విరాళాలు సేకరించి..రూ.18 లక్షల విలువైన బియ్యం బస్తాలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇంచార్జ్‌ను మారిస్తే గాని పార్టీ బలపడదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట జనసైనికులు.

క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ పార్టీ నుంచి సస్పెండ్..

అటు కొవ్వూరు నియోజకవర్గంలో పరిస్థితులు మరోలా ఉన్నాయట. ఇక్కడ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న టీవీ రామారావును జనసేన అధినాయకత్వం క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్, లీడర్లు సైలెంట్‌ అయిసోయారు. కొవ్వూరులో పార్టీని బలపరిచేందుకు వెంటనే నియోజవర్గ ఇంచార్జ్‌ను ప్రకటించాలని అనేకమంది జనసైనికులు పార్టీ అధిష్టానం దృష్టికి, పక్క నియోజకవర్గంలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లగా, కొద్దిరోజుల క్రితమే తిరిగి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావునే ఇంచార్జ్‌గా నియమించినట్లు తెలుస్తుంది. ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ పార్టీ బలోపేతానికి టీవీ రామారావు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పార్టీ క్యాడర్‌కు దిక్కుతోచడం లేదట.

ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాదు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న మరికొన్ని నియోజవర్గాల్లో కూడా జనసేన పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు. కొన్నిచోట్ల జనసేనకు బలమైన నాయకులు ఇంచార్జ్‌లుగా ఉన్నప్పటికీ..టీడీపీ నేతలు మాత్రం జనసైనికులు స్పేస్ ఇవ్వడం లేదట. మరోవైపు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పార్టీ పటిష్టతపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావట్లేదంటూ తలలు పట్టుకుంటున్నారట జనసైనికులు. ఇప్పటికైనా గోపాలపురం, కొవ్వూరు పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధి నాయతక్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు కార్యకర్తలు.

Also Read: నో డిఫెన్స్.. ఓన్లీ అటాక్..! కల్తీ నెయ్యిపై కూటమి ప్లాన్‌ బి..!