Ysrcp: గాజువాకలో రూట్ మార్చిన వైసీపీ..! ఆయన రాకతో పూర్వ వైభవం పక్కానా?
కేవలం ఒకే ఒక్కసారి గెలిచినా సరే సంచలన విజయాన్ని రికార్డు క్రియేట్ చేశారు. 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను 16వేల ఓట్లతో ఓడించి తన పేరు రీసౌండ్ చేసేలా గుర్తింపు పొందారు.
- Naveen
- Published On : March 20, 2026 / 10:30 PM IST
Representative Image (Image Credit To Original Source)
- డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ రూట్ మార్చిందా?
- నాగిరెడ్డి గాజువాకలో వైసీపీని విజయ తీరాలకు చేర్చగలరా?
- స్థానిక పోరు ముందు వైసీపీ వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా?
Ysrcp: లాస్ట్ మూమెంట్‌లో మార్పులు, చేర్పులు. గెలిచి తీరాలన్న ప్లాన్‌తో ఏదో చేస్తే ఇంకేదో జరిగింది. వైసీపీ ఊహించింది ఒకటి అయితే..జరిగింది మరొకటి అన్నట్లుగా గాజువాక పాలిటిక్స్..గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఏవేవో లెక్కలు వేసుకుని బరిలోకి దిగితే చివరకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారు అధిష్టానం పెద్దలు. డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు బిగ్ పొలిటికల్ స్కెచ్‌కు పదును పెడుతున్నారు. గాజువాక పాలిటిక్స్‌లో వైసీపీ వ్యూహాలు ఏంటి? ఆయన రాకతో అంతా మారిపోవడం పక్కానా?
ఏపీ పాలిటిక్స్‌లో గాజువాకకు స్పెషల్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లాగా..ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. అయితే గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగానే కాదు..గాజువాకలోనూ వైసీపీ వేసిన వ్యూహాలు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఘోర పరాజయం తప్పలేదు. దీంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దలు కాస్త అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని వైసీపీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. వైసీపీకి పీఏసీ అనేది చాలా ప్రెస్టీజియస్. సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు, కీలక నేతలకు మాత్రమే చోటు దక్కుతుంది.
పవన్ కల్యాణ్‌ను ఓడించి సంచలనం..
కానీ గాజువాకలో కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పల నాగిరెడ్డిని పీఏసీలోకి తీసుకోవడం వెనుక వైసీపీ స్ట్రాటజీ ఏంటన్నది విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగిరెడ్డి కేవలం ఒకే ఒక్కసారి గెలిచినా సరే సంచలన విజయాన్ని రికార్డు క్రియేట్ చేశారు. 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను 16వేల ఓట్లతో ఓడించి తన పేరు రీసౌండ్ చేసేలా గుర్తింపు పొందారు. అయితే మాత్రం ఏం లాభం..గత ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా ఆయన్ను పక్కన పెట్టింది. వృధ్ధాప్యం..అనారోగ్యం..కారణంగా తన కుమారుల్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ నాగిరెడ్డి హైకమాండ్‌కు ఛాయిస్ ఇచ్చి సైలెంట్ అయిపోయారు.
పవన్‌ను ఓడించిన నేతగా నాగిరెడ్డికి క్రెడిట్ ఉన్నా తన కుమారులకు టికెట్ ఇవ్వాలంటూ ఆయన చేసిన రిక్వెస్ట్‌ను వైసీపీ అధిష్టానం లైట్ తీసుకుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో యాదవ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలో నిలిపితే విజయం వరిస్తుందని అంచనా వేసి ఉరుకూటి చందు అనే నేతకు నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం గాజువాకలో గందరగోళం సృష్టించినా సరే పార్టీ పెద్దలు వెనక్కి తగ్గలేదు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఉరుకూటి చందుకే టికెట్ అనే సంకేతాలను బలంగా పంపారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో..కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ అమర్‌నాథ్‌ను లాస్ట్ మినిట్‌లో గాజువాక బరిలోకి దించారు. కూటమి తరుఫున యాదవ సామాజికవర్గ నేత పల్లా శ్రీనివాసరావు బరిలోకి దిగడంతో..కాపు ఈక్వేషన్స్..స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటూ వైసీపీ వేసిన స్కెచ్‌లన్నీ గాల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యేల్లో..గాజువాకలోనే టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు అత్యధిక మెజార్టీ వచ్చింది.
నాగిరెడ్డిని పీఏసీలోకి తీసుకోవడం వెనుక వైసీపీ స్ట్రాటజీ..
ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు వైసీపీ పెద్దలకు అసలు సీన్ అర్థమైందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో స్థానిక, విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు రానుండటంతో పట్టు నిలుపుకోవాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటుందట. ఇందులో భాగంగా తిప్పల నాగిరెడ్డిని మళ్లీ తెరపైకి తెచ్చారని అంటున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్నానని, వయోభారంతో రాజకీయాల్లో కొనసాగలేనని రెండేళ్ల క్రితమే చేతులెత్తేసిన తిప్పల నాగిరెడ్డిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ తెస్తూ..పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మెంబర్‌గా నియమించింది. ఈ నిర్ణయం వెనుక వైసీపీ పెద్ద కసరత్తే చేసిందన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం వైసీపీకి గాజువాకలో దిక్కూమొక్కూ లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన గుడివాడ అమర్‌నాథ్ చోడవరం నియోజకవర్గానికి వెళ్లిపోయారు. దీంతో వైసీపీకి నియోజకవర్గాన్ని నడిపే నాయకుడు కరువయ్యాడు. గ్రేటర్ విశాఖ సిటీలోనే ఇలాంటి దుస్థితి ఉంటే కష్టమని భావించి నాగిరెడ్డికి హితబోధ చేసి మరీ ఈ బాధ్యతలు అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ సంగతి తర్వాత ముందు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని నాగిరెడ్డికి టాస్క్ ఇచ్చారట. చెరోదారిలో వెళ్లిపోయిన తన కుమారులను కూడా దారికి తెచ్చుకుని పార్టీకో దారి చూపిస్తారనే ఆశలతోనే వైసీపీ నాగిరెడ్డికి పీఏసీ చాన్స్ ఇచ్చారని అంటున్నారు. కూటమి నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నాగిరెడ్డి గాజువాకలో వైసీపీకి పూర్వవైభవం తీసుకొస్తారో లేదో చూడాలి.
Also Read: పవన్ కల్యాణ్ సరికొత్త పాలిటిక్స్..! జెన్ జీ సెంట్రిక్‌గా సేనాని మాస్టర్ ప్లానేంటి?
