విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కూటమి ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గింది, వైసీపీ వ్యూహం ఫలించిందా?

దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్‌లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్‌.... ప్రశాంతంగా ముగినట్లైంది.

Gossip Garage : విశాఖ ఎమ్మెల్సీ టెస్ట్‌లో ఉత్కంఠకు తెరదించింది కూటమి ప్రభుత్వం. హుందా రాజకీయాల కోసం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. దీంతో వారం రోజుల హంగామాకు తెరపడింది. మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే…. వారం రోజులుగా రకరకాల ప్రచారాలు… ఎన్నో రకాల గాసిప్స్‌ వినిపించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకోడానికి ప్రధాన కారణమేంటి? అధికార పార్టీ వెనక్కి తగ్గేలా బొత్స ఏం చేశారు? వైసీపీ వ్యూహం ఫలించిందా?

ఓటర్లను కాపాడుకోడానికి క్యాంపు రాజకీయాలు..
విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై క్లారిటీ వచ్చేసింది. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెంచిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక… కూటమి నిర్ణయంతో టీ కప్పులో తుఫాన్‌లా తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఇక లాంఛనంగానే చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇద్దరు నామినేషన్లు వేశారు. ఇందులో ఒకరు మాజీ మంత్రి బొత్స కాగా, మరొకరు ఇండిపెండెంట్‌ అభ్యర్థి షఫీ ఉల్లా… ఈయన నామినేషన్‌ ఉపసంహరించుకుంటే బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే… నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ తర్వాత బొత్స ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ ప్రకటన చేయనుంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… జరుగుతున్న ఈ ఉప ఎన్నిక అనేక నాటకీయ పరిణామాలకు దారితీసింది. కూటమి పోటీ చేయొచ్చనే ప్రచారంతో వైసీపీ ఎంతో టెన్షన్‌ పడింది. తన ఓటర్లను కాపాడుకోడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఐతే తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు నామినేషన్ల చివరి రోజున టీడీపీ తాపీగా ప్రకటించడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

తలనొప్పులు పెంచుకోవడం కన్నా, ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్‌..
వాస్తవానికి వైసీపీకి సిట్టింగ్‌ స్థానమైన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి పోటీపై తొలి నుంచి కూటమిలో తర్జనభర్జన కొనసాగింది. కేవలం 830 ఓట్లు ఉన్న ఈ స్థానంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు… ఇందులో వైసీపీకి చెందిన వారే సుమారుగా 550 మంది వరకు ఉంటారు. టీడీపీ మిత్రపక్షాలకు కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎమ్మెల్సీ గెలవాలంటే 300 మందిని సమీకరించాల్సి వుంటుంది. దీంతో కూటమి నేతలు ఆలోచనలో పడ్డారు. అంతమంది మద్దతు కూడగట్టడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల పెద్ద కష్టమేమీ కాకపోయినప్పటికీ, ఇలా పార్టీలోకి తెచ్చిన వారికి భవిష్యత్‌లో ఏదో రకమైన పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతో కూటమి వెనక్కి తగ్గింది.

కొత్తగా నేతలను చేర్చుకుని తలనొప్పులు పెంచుకోవడం కన్నా, ఒక్క ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్‌ అని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. సీఎం ఆదేశిస్తే ఎమ్మెల్సీని గెలిపిస్తామని ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ, ప్రభుత్వానికి అవసరం లేని ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం అంత ప్రయాస పడటం ఎందుకని సీఎం భావించినట్లు చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా బొత్సను బరిలోకి దింపిన జగన్..
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నుంచి విశాఖలో రాజకీయ వేడి మొదలైంది. కూటమి ప్రభుత్వం జోరు మీద ఉండటంతో వైసీపీ టెన్షన్‌ పడింది. తమ సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారడంతో సీనియర్‌ నేత బొత్సను బరిలోకి దించింది. స్థానిక సంస్థల ప్రతినిధులే ఓటర్లుగా ఉండే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో చాలామంది నేతలు పోటీకి సిద్ధమయ్యారు. కానీ, వైసీపీ అధినేత జగన్‌ మాత్రం వ్యూహత్మకంగా బొత్సను బరిలోకి దింపారంటున్నారు. బొత్స కాకుండా ఇంకేనేతను పోటీకి పెట్టినా… కూటమి తప్పకుండా పోటీ చేసేది అంటున్నారు వైసీపీ నేతలు.

ఓటర్లను వారి కుటుంబాలతో సహా క్యాంపులకు తరలింపు..
రాజకీయంగా, అంగ, అర్థబలాల్లో ఉత్తరాంధ్రలో బొత్సను మించిన వారు లేరు. మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న బొత్స అయితేనే కూటమిని తట్టుకోగలరని వైసీపీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయం వర్కౌవుట్‌ అయింది. అధినేత ఊహించినట్టుగానే ఎమ్మెల్సీ టికెట్‌ దక్కించుకున్న వెంటనే బొత్స రంగంలోకి దిగారు. ప్రధానంగా ఓటర్లు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్‌ చేశారు. తన కుటుంబ సభ్యులు, అనుచరులను ఒక్కో మండలానికి ఇన్‌చార్జిగా పెట్టి… ఓటర్లను వారి కుటుంబాలతో సహా క్యాంపులకు తరలించారు.

అధికార పార్టీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేలోపే…. ఆ పార్టీకి ఓటర్లు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బొత్స. దీంతో కూటమి కూడా పునరాలోచనలో పడింది. విశాఖ ఎమ్మెల్సీ గెలిస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేదీ లేదు. కానీ, ఓడితే పరువు పోతుందనే ఉద్దేశం కూడా వెనక్కి తగ్గేలా చేసిందంటున్నారు. మొత్తానికి దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్‌లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్‌…. ప్రశాంతంగా ముగినట్లైంది.

Also Read : ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో వైసీపీ నేత..! మాజీ మంత్రి చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు