Thopudurthi Prakash Reddy: జగన్ సన్నిహితుడికి కూటమి ప్రభుత్వం బిగ్ షాక్..! ఆ స్కామ్‌లో అరెస్ట్ తప్పదా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో అతి చేసిన వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టుల ఎపిసోడ్‌ నడుస్తూనే ఉంది. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ..రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Published On : April 6, 2026 / 10:38 PM IST
  • తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై హౌసింగ్ స్కామ్ అలిగేషన్స్
  • పేదల ఇళ్ల పేరుతో..తోపుదుర్తి మోసం చేశారని కేసు
  • రాక్రీట్‌ సంస్థ పేదలను నిలువునా ముంచిందన్న ఆరోపణలు
  • ప్రభుత్వం నుంచి మెటీరియల్‌ తీసుకుని పక్కదారి పట్టించారా?
  • రాక్రీట్‌ సంస్థ ఇటు పేదలు, అటు ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టిందా?

 

Thopudurthi Prakash Reddy: మరో వైసీసీ లీడర్‌ను రౌండప్ చేస్తోంది కూటమి సర్కార్. హౌసింగ్‌ స్కామ్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడైన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. పేదల ఇళ్ల పేరుతో తోపుదుర్తి మోసం చేశారంటూ లబ్ధిదారులు ఇచ్చిన ఫిర్యాదులతో ఆయనపై కేసు నమోదైంది. ఇళ్ల నిర్మాణం వ్యవహారంలో తోపుదుర్తి ఇరుక్కున్నట్లేనా? కేసు ఫైల్.. వాట్‌నెక్స్ట్‌? విచారణకు పిలుస్తారా? డైరెక్టుగా అరెస్ట్ చేస్తారా?

వైసీపీ కీలక నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి బిగ్ షాక్‌ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. తోపుదుర్తికి చెందిన నిర్మాణ సంస్థ రాక్రీట్..పేదల ఇళ్ల నిర్మాణంలో మోసం చేసిందని విజయవాడలో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ తీరుతో దాదాపు రూ.4 కోట్ల వరకు నష్టం జరిగిందని, పేదల ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని పోలీసులు కేసు పెట్టారు. దీంతో ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుతో ప్రభుత్వ హిట్ లిస్టులో మరో వైసీపీ నేత చేరారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

పేదల ఇళ్ల పేరుతో దోపిడీ చేశారని ఆరోపణలు..

వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తోపుదుర్తి పేదల ఇళ్ల పేరుతో దోచేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. విజయవాడ శివార్లలోని నున్న జగనన్న మోడల్ కాలనీ, పళ్లతిప్పలో మరో కాలనీ నిర్మాణానికి తోపుదుర్తికి చెందిన రాక్రీట్ సంస్థ కాంట్రాక్టు తీసుకుందని చెబుతున్నారు. దాదాపు 3 వేల ఇళ్లను నిర్మిస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకుని.. ప్రభుత్వం నుంచి దశల వారీగా మెటీరియల్ కూడా తీసుకుందని చెబుతున్నారు. కానీ రాక్రీట్ సంస్థ పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, కొన్ని ఇళ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేసిందని అంటున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగా..రాక్రీట్ సంస్థ రూ.4 కోట్ల విలువైన మెటీరియల్ తీసుకుని పనులు చేయలేదని గుర్తించారట. దీంతో కేసు నమోదు చేయాలని కోరుతూ..విజయవాడ సీపీకి లేఖ రాశారట. న్యాయ సలహా తీసుకున్న తర్వాత కమిషనర్ ఆదేశాలతో రాక్రీట్ సంస్థపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారట.

మూడు దశల్లో ఇళ్లు నిర్మిస్తామని మోసం..

నున్న, పళ్లతిప్ప లేఔట్లలో 1500 చొప్పున మొత్తం 3 వేల ఇళ్ల నిర్మాణానికి రాక్రీట్ సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారట. అయితే రాక్రీట్ సంస్థ ఆ మొత్తానికి పనులు చేపట్టలేమని చెబుతూ ఒక్కో ఇంటికి రూ.35 వేల చొప్పున అదనంగా కావాలని అడిగిందట. ఆ మొత్తం ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదరిందని చెబుతున్నారు. రాక్రీట్ అడిగిన అదనపు మొత్తాన్ని డ్రాక్వా సంఘాల ద్వారా రుణంగా ఇప్పించారట. అయితే మూడు దశల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన రాక్రీట్ మోసం చేసిందని, ప్రభుత్వం నుంచి తీసుకున్న సిమెంట్, స్టీల్ పక్కదారి పట్టించిందని ఆరోపిస్తున్నారు.

గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న రాక్రీట్ సంస్థ..గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నచ్చినట్లు నిబంధనలను మార్చుకుందని అంటున్నారు. రాక్రీట్ సంస్థకు లబ్ధి జరిగేలా పునాదుల కోసం రూ.70 వేలు చెల్లించేలా నింధనలు మార్చారట. పునాదుల కోసం రూ.70 వేలు డ్రా చేసిన రాక్రీట్ పనులను మధ్యలోనే వదిలేసిందని గత ప్రభుత్వ హయాంలోనే లబ్ధిదారులు ఫిర్యాదులు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో రాక్రీట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులు మళ్లీ ఫిర్యాదులు చేయడంతో కేసు పెట్టారని చెబుతున్నారు. రాక్రీటు సంస్థ కాంట్రాక్ట్ తీసుకున్న ఇళ్లలో 300 గృహాలకు పునాదులు వేశారు. 150 ఇళ్లకు బేస్‌మెంట్‌ పీసీసీ, 70 ఇళ్లను పైకప్పు వరకు, 200 ఇళ్లను శ్లాబ్‌ లెవల్‌కు నిర్మించి అర్ధంతరంగా పనులు నిలిపివేశారట. తర్వాత ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు హౌసింగ్‌ అధికారులకు అందుబాటులో లేకుండా పోయారట. ఫోన్లు చేసినా.. ఎవరూ రియాక్ట్ కావడం లేదట. 3 వేల ఇళ్లలో కనీసం 300 ఇళ్లు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదని చెబుతున్నారు.

అప్పట్లో అతి చేసిన వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టులు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో అతి చేసిన వైసీపీ నాయకులపై కేసులు, అరెస్టుల ఎపిసోడ్‌ నడుస్తూనే ఉంది. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ..రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అపోజిషనల్‌లోకి వచ్చాక కూడా రాప్తాడులోనూ తోపుదుర్తి హల్‌చల్‌ చేస్తున్నారు.

కూటమి సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటున్న ఆయన.. పరిటాల ఫ్యామిలీ టార్గెట్‌గానే రాజకీయ విమర్శలకు పదును పెడతున్నారు. ఈ క్రమంలోనే ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారులు చేసిన ఫిర్యాదులు..కూటమి ప్రభుత్వానికి అస్త్రంగా మారాయి. కేసు పెట్టిన పోలీసులు..త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందంటున్నారు. లేకపోతే అరెస్ట్‌ చేసి షాక్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం.

Also Read: ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ తెరపైకి ప్రాంతీయ వాదం..? రాయలసీమ నేతల డిఫరెంట్ టోన్‌ వెనుక ప్లానేంటి?