Greater Rayalaseema: ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ తెరపైకి ప్రాంతీయ వాదం..? రాయలసీమ నేతల డిఫరెంట్ టోన్ వెనుక ప్లానేంటి?
అమరావతి ప్రాంతాన్ని కానీ విజయవాడ గుంటూరును కానీ రాజధానిగా ఎంపిక చేయొద్దని శివరామకృష్ణన్ కమిషన్ కీలక సూచనలు చేసిందంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని ప్రైవేట్ భూములు అంతకంటే తీసుకోవద్దని కమిషన్ చెప్పిందంటున్నారు.
- అమరావతికి లైన్ క్లియర్ అయిన వేళ పాత స్టోరీ రిపీట్
- గ్రేటర్ రాయలసీమ అంటూ మైసూరారెడ్డి కామెంట్స్
- గతంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమంటూ డిమాండ్లు
- ఓ వైపు రాజధాని రచ్చ..మరోవైపు గ్రేటర్ రాయలసీమ స్లోగన్
Greater Rayalaseema: ఎప్పటినుంచో ఉన్న చర్చ. మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్న టాపిక్. ఇప్పుడు మరోసారి నవ్యాంధ్ర పాలిటిక్స్‌లో హాట్ ఇష్యూగా మారింది. ఓవైపు అమరావతికి లైన్ క్లియర్ అయింది. రాజధానికి రాజముద్రతో దశా దిశా మారిపోతుందనుకుంటే..మావిగన్ పేరుతో జగన్ మంటలు రాజేశారు. దీంతో ఇటు కూటమి, అటు వైసీపీ మధ్య క్యాపిటల్ ఫైట్ నడుస్తున్న వేళ..గ్రేటర్ రాయలసీమ అంటూ కొత్త చర్చకు తెరలేపారు ఓ సీనియర్ లీడర్. సరిగ్గా ఇదే టైమ్‌లో ఆ చర్చ ఎందుకు? రాయలసీమ నేతలు డిఫరెంట్ టోన్ వెనుక ప్లానేంటి?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన టైమ్‌లోనే రాయలసీమ అస్తిత్వం అంటూ చర్చలు జరిగాయి. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అంటూ మాజీమంత్రి మైసూరారెడ్డి మరోసారి స్లోగన్ అందుకున్నారు. నవ్యాంధ్రలో ఇప్పుడిప్పుడే రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణా విడిపోయాక 2014 నుంచి 12 ఏళ్లుగా ఏపీ రాజధాని అంశం ప్రతి రోజు చర్చకు వస్తోంది.
ఇప్పుడు అమరావతి రాజధానిగా పార్లమెంట్ ఉభయసభలు లైన్ క్లియర్ చేసినా..వైసీపీ మాత్రం మావిగన్ స్లోగన్ బలంగా వినిపిస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి హోదా దక్కిందన్న సంతోషం దక్కిందో లేదో..వైసీపీ క్యాపిటల్ ఫైట్‌కు తెరలేపింది. సరే అది ఎప్పటికీ ఉండే ముచ్చటే అనుకుంటే..సీనియర్ రాజకీయ నేత మాజీమంత్రి మైసూరారెడ్డి ఒక బాంబు పేల్చారు. ఏపీలో రాజధాని పరిణామాలు, రాజకీయాలు చూస్తుంటే గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం తప్పదని అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ చేసిన సిఫార్సులను గుర్తు చేశారు. అమరావతి ప్రాంతాన్ని కానీ విజయవాడ గుంటూరును కానీ రాజధానిగా ఎంపిక చేయొద్దని శివరామకృష్ణన్ కమిషన్ కీలక సూచనలు చేసిందంటున్నారు. దొనకొండ దగ్గర ఏకంగా 70 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కూడా కమిషన్ చెప్పిందన్నారు. అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని ప్రైవేట్ భూములు అంతకంటే తీసుకోవద్దని కమిషన్ చెప్పిందంటున్నారు.
ఈపాటికే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందని కామెంట్..
కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పట్టుబట్టి మరీ వ్యవసాయ భూములు, పైగా ముంపు ప్రాంతం అయిన అమరావతిని ఎంపిక చేశారని మైసూరారెడ్డి విమర్శించారు. మావిగన్ పేరుతో జగన్ కొత్త ప్రతిపాదనలు చేయడం మరింత బాధాకరం అన్నారు. నాడు అమరావతికి ఓకే చెప్పి..ఆ తర్వాత మూడు రాజధానుల నినాదాన్ని ముందుకు తెచ్చారన్నారు. ఇప్పుడు మావిగాన్ అంటూ అర్థం పర్దం లేని మాటలు ఎందుకు అంటూ మండిపడ్డారు. శివరామ కృష్ణన్ కమిషన్ వద్దు అన్నచోటే ఈ ఇద్దరు నాయకులు రాజధాని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈపాటికే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందని, వయసు కారణంగా ఆగిపోతున్నానని అంటున్నారు. కానీ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై యువత స్పందించాలని వారు గ్రేటర్ రాయలసీమ నినాదంతో ఉద్యమించాలని మైసూరారెడ్డి పిలుపు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
గ్రేటర్ రాయలసీమ డిమాండ్ కొత్తేమీ కాదు. ఏపీ, తెలంగాణ విభజన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాయల తెలంగాణ కావాలని సోనియా గాంధీకి విన్నవించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలను తెలంగాణతో కలిపితే అది ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని ఆయన కోరారు. ఇక బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటూ దీక్షలు కూడా చేశారు. రాయలసీమ హక్కులు, నీళ్లు, నిధులు అంటూ కొన్నాళ్లు హడావుడి చేసి సైలెంట్ అయిపోయారు. గ్రేటర్ రాయలసీమ అంటూ మైసూరారెడ్డితో పాటు గంగుల ప్రతాప్‌రెడ్డి వంటి నేతలు గతంలోనే తెరమీదకు తెచ్చారు.
గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్..
ఒకప్పటి రాజధాని కర్నూలుతో పాటు మొత్తం రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికీ అన్యాయం జరుగుతుందని చెబుతున్న నేతలు..కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ఒంగోలు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కొందరు సీమకు అన్యాయం జరుగుతోందని ఆందోళనలు చేపట్టారు. కానీ, 2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఈ గళం పూర్తిగా మూగబోయింది. ఆ సమయంలో రాయలసీమ గురించి ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా..ఓ వైపు అమరావతికి చట్టబద్ధత దక్కిన వేళ..గ్రేటర్ రాయలసీమ నినాదాన్ని పొలిటికల్ స్క్రీన్‌పైకి తేవడం ఆసక్తికరంగా మారింది.
Also Read: ఉద్యోగం నుంచి తీసేసిన ఒరాకిల్.. అయినా బేఫికర్.. ఉబర్ డ్రైవర్‌గా మారిన టెకీ
