వైసీపీకి మరో బిగ్ షాక్? టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్సీల ఆసక్తి..!

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా? మండలిలో మెజార్టీతో ప్రభుత్వానికి చెక్ చెప్పాలని భావించిన వైసీపీ అధిష్టానానికి…. ఆ పార్టీ నేతలే షాక్‌ ఇవ్వనున్నారా? ప్రతిపక్ష సభ్యులుగా కొనసాగేకన్నా, అధికార పార్టీలో చేరడమే ఉత్తమమనే ఆలోచన చేస్తున్నారా? వైసీపీని వీడాలని అనుకుంటున్న ఎమ్మెల్సీలు ఎవరు? టీడీపీ ఆకర్ష్ వల వేస్తోందా? వైసీపీ ఎమ్మెల్సీలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవాలని తహతహలాడుతున్నారా? మండలి రాజకీయమేంటి?

వైసీపీని వీడేందుకు ఎమ్మెల్సీలు మొగ్గు..
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల రోజులుగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా తమను ఉత్సవ విగ్రహాల్లా చూసిన అధిష్టానం….. అధికారం పోయిన తర్వాత పోరాడమని చెప్పడాన్ని ఎమ్మెల్సీలు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు.

టీడీపీ డోర్స్ ఓపెన్ చేస్తే..
రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ, మండలి వైస్‌ చైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. కడప జిల్లాకు చెందిన జకియా ఖానమ్‌ వైసీపీలో విలువలేదని ఆవేదన చెందుతూ టీడీపీలోకి వచ్చేస్తానని మైనార్టీ వ్యవహారాల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కలిసినట్లు చెబుతున్నారు. వైసీపీలో కనీస గుర్తింపు లేదనే కారణంతో సుమారు ఆరేడుగురు ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు. టీడీపీ డోర్స్‌ ఓపెన్‌ చేస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే చాన్స్‌ ఉందంటున్నారు.

వైసీపీ సభ్యుల్లో చాలామంది టీడీపీతో టచ్‌లోకి..
ఏపీ శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్‌ కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్‌ అయిన సభ్యులు 8 మంది ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఇద్దరు వైసీపీపై తిరుగుబాటు చేయడంతో అనర్హత వేటు పడింది. దీనిపై ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, జంగా కృష్ణమూర్తి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఐతే వైసీపీ 30 మంది సభ్యుల్లో చాలా మంది టీడీపీలోకి టచ్‌లోకి వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారమే హీట్‌ పుట్టిస్తోంది. మండలి వైఎస్‌ చైర్మన్‌ జకియా ఖానమ్‌తోపాటు గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పోతుల సునీత కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. ఆమె విషయంలో టీడీపీలో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం వల్ల అధిష్టానం తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు.

టీడీపీలో చేరేందుకు ఐదుగురు ఎమ్మెల్సీలు సిద్ధం?
ఈ ఇద్దరే కాకుండా రాయలసీమకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ మద్దతుతో ఉపాధ్యాయ కోటాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం సైకిల్‌ సవారీకి ఆసక్తిగా ఉన్నారంటున్నారు. ఇదే ఆలోచనలో మరింత మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. కొంతమంది టీడీపీ మంత్రుల ద్వారా పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారని సమాచారం. మరికొంతమంది వచ్చి కలుస్తామంటూ మంత్రుల అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నారు.

ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదని భావన..
అయితే, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఐదేళ్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదని భావిస్తున్నారు. అదే సమయంలో వారి విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటువంటి నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కూడా ఆసక్తి చూపించడం లేదని టీడీపీ వర్గాల సమాచారం. మొత్తానికి మండలి సభ్యులు టీడీపీలో చేరికకు ఆసక్తి చూపుతున్నా, అటు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిబేట్‌గా మారింది.

Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా? ఎక్కడున్నారు, ఏమైపోయారు..

ట్రెండింగ్ వార్తలు