ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటివరకు అమరావతి రాజధానిగా ఉన్న ఏపీ.. ఇకపై మూడు రాజధానుల రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి.
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ రెండు బిల్లులు గవర్నర్ వద్దే ఉన్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. జులై 31, 2020న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది.
సెప్టెంబర్ 13,2019న జీఎన్ రావు కమిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 20, 2019న పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్స్ చేసింది. జనవరి 20,2020న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపింది. జూన్ 16న రెండు బిల్లులకు అసెంబ్లీ రెండోసారి అమోదం తెలిపింది.
మూడు వారాల క్రితం రెండు బిల్లులను ప్రభుత్వం.. గవర్నర్ ఆమోదానికి పంపింది. బిల్లులపై న్యాయశాఖ అధికారులతో గవర్నర్ సంప్రదింపులు జరిపారు. శాసనమండలిలో పెండింగ్ లో ఉన్న రెండు బిల్లులకు ఇవాళ గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఏపీలో ముడు రాజధానుల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.