Gurajada Apparao Award To Chaganti : చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అప్పారావు అవార్డు .. సాహితీ వేత్తలు, హేతువాదుల ఆగ్రహం

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అప్పారావు పురస్కారం ప్రకటించారు. దీనిపై సాహితీ వేత్తలు, హేతువాదుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Gurajada Apparao Award To Chaganti : ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ అవార్డు ప్రధానంపై ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. గురజాడ అవార్డ్‌ను స్వీకరించేందుకు.. చాగంటి అంగీకరించారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని జ్ఞానసరస్వతీ ఆలయంలో ఈ అవార్డ్ ప్రధానోత్సవం జరుగనుంది. ఈకార్యక్రమంలోనే గురజాడ అవార్డును అందుకునేందుకు అంగీకరించారు చాగంటి. అయితే గత కొన్ని రోజులుగా సాహితీ వేత్తలు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నెలకొనడం తెలిసిందే. గురజాడ విశిష్ట పురస్కారాన్ని చాగంటికి అందించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు సాహితీవేత్తలు. చాగంటికి అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై హేతువాదులు, కవులు, కళాకారులు నిరసన వ్యక్తం చేశారు చేస్తున్నారు. గురజాడ అప్పారావు తన జీవితకాలం అంతా హేతువాదిగా, అభ్యుదయ వాదిగా ఉన్నారని.. అందుకు భిన్నమైన మార్గంలో సాగుతున్న చాగంటి భగవంతుడి గురించి ప్రవచనాలు చెబుతారని.. విరుద్ధ వైఖరులతో ఉన్నప్పుడు అవార్డు ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. గురజాడ పురస్కారాన్ని ఇస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. ఇటువంటి పరిస్థితుల్లో చాగంటి అవార్డు అందుకుంటారా? లేదా అనే సందిగ్దత నెలకొంది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతు చాగంటి గురజాడ పురస్కారాన్ని అందుకుంటానని స్పష్టంచేశారు.

ఈక్రమంలో బుధవారం (నవంబర్ 30,2022) కాస్త మెత్తబడిన హేతువాదులు కొన్ని షరతులతో చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వటానికి అంగీకరించారు. గురజాడ రచనలను, సిద్ధాంతాలను, అభ్యుదయ భావాలను చాగంటి ప్రచారం చేస్తే అవార్డు స్వీకరించడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు. గురజాడ అభ్యుదయ వాదనలను ప్రచారం చేస్తానని చాగంటి అంగీకరించాలని, ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే అవార్డు స్వీకరించాలని స్పష్టం చేశారు.

కాగా గురజాడకు నివాళిగా గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ప్రతీ సంవత్సరం గురజాడ విశిష్ట పరస్కారాన్ని అందజేస్తారు.2000 సంత్సరం నుంచి ప్రతీ ఏడాది ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ఏడాది ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వాలని సభ్యులు నిర్ణయించారు.ఈక్రమంలో చాగంటి గురజాడ అవార్డు ఇవ్వటంపట్ల కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలాది మాట్లాడుతూ కులాల పట్ల తీవ్రవివక్ష చూపించే చాగంటికి గురజాడ అవార్డు ఇవ్వటం సిగ్గుచేటన్నారు.

ఇదిలా ఉండగా విజయనగరంలో గురజాడ 107 వ వర్ధంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. గురజాడ ఇంటి నుంచి విగ్రహం వరకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ర్యాలీ నిర్వహించారు. గురజాడ గేయాలను ఆలపించారు. విశాఖలోనూ గురజాడ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. అర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గురజాడ అభ్యుదయ భావాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవశ్యకత ఉందని సాహితీ వేత్తలు పిలుపునిచ్చారు.

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న ఏపీలోని విజయనగరం జిల్లా ఎస్.రాయవరంలో జన్మించారు. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఆయన హేతువాది కూడా.19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. గురజాడ అప్పారావు రచనల్లో కన్యాశుల్కం అనే నాటకానికి సాహితీ లోకంలో ఓ ప్రత్యేక స్థానముంది. ఈనాటికీ కన్యాశుల్కం పరిస్థితులు వేరుగా ఉన్నా ఆడపుట్టులపై జరిగే అన్యాయాలకు అద్దపడుతుంది.  ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశంమధురవాణిరామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలోవాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడుగా వెలుగొందుతున్నారు. గురజాడకు  కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.

ట్రెండింగ్ వార్తలు