Heavy Rain Fall: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో పలాస నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గౌతు శిరీష ఇంటిని వదర నీరు చుట్టు ముట్టింది. ఎమ్మెల్యే ఇంటి చుట్టు భారీగా వర్షపు నీరు చేరింది. అటు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో మహేంద్ర తనయ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
మరోవైపు మందస మండలంలోని కుంటికోట, రాజపురం, మకరజోల, అచ్యుతాపురం గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవనం స్థంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం.. ఒడిశా రాష్ట్రం గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకింది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. క్రమంగా బలహీన పడనుంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ.. దాని ప్రభావం ఇవాళ కూడా కొనసాగనుంది. ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆకస్మిక వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.