×
Ad

Tirumala Rain : ఫెంగాల్ ఎఫెక్ట్.. తిరుమలతో ఎడతెరిపిలేని వర్షం, విరిగిపడ్డ కొండచరియలు..

అటు వర్షం, ఇటు ఈదురుగాలులు.. వీటికి తోడు చలి తీవ్రత పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

  • Published On : December 1, 2024 / 07:24 PM IST

Tirumala Rain : ఫెంగాల్ తుపాను ఎఫెక్ట్ తో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షంతో తిరుమలలోని రెండో ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో టీటీడీ సిబ్బంది అలర్ట్ అయ్యింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా విరిగిపడిన కొండ చరియలను సిబ్బంది తొలగిస్తున్నారు.

మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని డ్యాముల జల కళను సంతరించుకున్నాయి. తిరుమలలో ఉన్న 5 ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార.. జలాశయాలు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.

గత రెండు రోజులుగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన పడుతోంది. వర్షంలోనే భక్తులంతా స్వామి వారిని దర్శించుకుని వెళ్తున్నారు. నాన్ స్టాప్ గా కురుస్తున్న వానతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

గత రెండు రోజులుగా శ్రీవారి ఆలయం మంచు దుప్పటి కప్పుకుంది. ఎటు చూసినా మంచు వాతావరణం కనిపిస్తోంది. అటు వర్షం, ఇటు ఈదురుగాలులు.. వీటికి తోడు చలితీవ్రత పెరగడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలతో తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోయాయి. డ్యామ్ లలో పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడంతో రేపటి రోజున గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

కంటిన్యూగా కురుస్తున్న వానతో కొండలన్నీ బాగా నానిపోయాయి. దాంతో ఘాట్ రోడ్ లో అక్కడక్కడ కొండచరియలు విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ సిబ్బంది, అధికారులు కొండచరియలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.

 

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్..! ఢిల్లీ నుంచి గల్లీ వరకు సేనాని దూకుడు, దేశం కళ్లన్నీ పవన్ వైపే..!

తిరుమలను కమ్మేసిన పొగమంచు..
తిరుమలలో భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంచు దుప్పట్లో తిరుమల గిరులు ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో విపరీతమైన చలి, పొగమంచు పెరిగాయి. తిరుమలలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.