నీట మునిగిన కాలనీలు, స్తంభించిన జనజీవనం.. విజయవాడలో వరద బీభత్సం

ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న వారికి.. పీకల్లోతు నీటిలో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు.

Vijayawada Floods : విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. బుడమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడతో సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరద కారణంగా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వృద్ధులను, పిల్లలను బయటకు తీసుకొస్తున్నారు. అజిత్ సింగ్ నగర్, లోన సెంటర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో అనేక మంది వరద నీటిలో చిక్కుకున్నారు. ఉదయం నుంచి వరదల్లో చిక్కుకున్న వారికి.. పీకల్లోతు నీటిలో ఆహారం, మందులు తీసుకెళ్తున్నారు.

ఒకవైపు భారీ వర్షాలు, వరదలు.. మరోవైపు ఉప్పొంగిన బుడమేర వాగు.. విజయవాడను అతలాకుతలం చేసేశాయి. బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా కాలనీలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఒకవైపు 30 సెంటీమీటర్ల వాన మరోవైపు బుడమేరు వాగు పొండడంతో ఈ దయనీయ దుస్థితి నెలకొంది. కొందరు ఆహారం, తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతంగా వర్షం కురిసిందని, అదే ఈ పరిస్థితి కారణం అని స్థానికులు చెబుతున్నారు.

బుడమేరు కట్ట పొంగడంతో సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న దిగువ ప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరద నీటిలో చిక్కుకుపోయి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సహాయ సహకారాల కోసం ఆర్తనాదాలు పెడుతున్నారు. నీటి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బోట్ల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది నడుము లోతు నీటిలోనే ముందుకు సాగుతున్నారు. అయితే వృద్ధులు, పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఓవైపు భారీ వరదలు, మరోవైపు ఎగువ నుంచి వచ్చే నీరు ఎక్కువ కావడంతో బుడమేరు కట్ట తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా నీరంతా ముంచెత్తింది. సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం, అజీజ్ సింగ్ నగర్, భవానీపురం, గొల్లపూడి పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. స్థానికంగా దయనీయ పరిస్థితులు ఉన్నాయి.

 

Also Read : భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది- సీఎం చంద్రబాబు

ట్రెండింగ్ వార్తలు