Andhra Pradesh Rain (Photo : Google)
Andhra Pradesh – Rain : మాడు పగిలే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో, వడగాల్పులతో విలవిలలాడిన ఏపీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన వర్షం ఎట్టకేలకు పడింది. వరుణుడు కరుణించాడు. వాన కురిపించాడు. మంగళవారం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
రుతుపవనాల కదలికతో వర్షం పడి ప్రజలకు ఉపశమనం లభించింది. అటు, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దాంతో అక్కడ కూడా వాతావరణం చల్లబడింది. ఇప్పటివరకు ఎండలతో అల్లాడిన ప్రజలు.. ఒక్కసారిగా వర్షం పడి వాతావరణం చల్లగా మారడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు.
రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఈసారి ఎండలు మండిపోతున్నాయి. వేసవి ముగిసినా ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు భగభగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు రుతుపవనాల వేగంగా విస్తరిస్తాయా? వర్షాలు పడతాయా? ఈ భగభగల బాధ తప్పుతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.