Rain Alert
Rain Alert : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, రాబోయే మూడు నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తమిళనాడు తీరం వెంట బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అవసరం అయితే తప్ప ప్రజలకు బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరిసీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆ వరద పోటెత్తి శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహకంలోని 60కిపైగా గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. శ్రీకాకుళం నగరంతోపాటు పలు ఊళ్లు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. దాదాపు 8వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పాత పట్నం, అమదాలవలస నియోజకవర్గాల్లో పంటనష్టం ఎక్కువగా ఉంది. వంశధార కరకట్టలు బహీనంగా ఉండడంతో పలు చోట్ల కోతకు గురయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.