Anantapur Rains : ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో వర్ష బీభత్సం.. నీటమునిగిన కాలనీలు.. జనం విలవిల

నిత్యం కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అవుతోంది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునిగడంతో జనం అల్లాడిపోతున్నారు.

Anantapur Rains : అనంతపురం.. ఈ పేరు చెబితే చాలు.. ముందుగా గుర్తుకొచ్చేది కరువు కాటకాలే. అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. వానా కాలంలో కూడా ఇక్కడ వానలు పడేది అంతంత మాత్రమే అని చెప్పాలి. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. పలు చోట్ల తాగడానికి నీరు దొరికే పరిస్థితి కూడా లేదు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వానలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తాయి. అనంత జిల్లా జల విలయంలో చిక్కుకుంది. ప్రజలు విలవిలలాడిపోతున్నారు.

నిత్యం కరవు కాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోత వానలతో అనంతపురం అతలాకుతలం అవుతోంది. చెరువులు తెగిపోవడంతో వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు, పొంట పొలాలు నీట మునిగడంతో జనం అల్లాడిపోతున్నారు.

భారీగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జలమయం అయ్యింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అనంతపురంలోని విశ్వశాంతి నగర్, రుద్రంపేట, జాకిర్ కొట్టాలు, ఆదర్శ్ కాలనీ, సుందరయ్య కాలనీ, దండోరా కాలనీలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు నిండిపోవడంతో జలకళ సంతరించుకుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కుండపోతగా కురుస్తున్న వానలకు తోడు చెరువులు నిండి నీరు ఉధృతంగా రావడంతో నడిమివంక సమీప కాలనీల్లో నీరు నడుము లోతుకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో అనంతపురంలోని రామయ్య కాలనీలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే మూడు అడుగుల మేర చేరిన నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. కాలనీలోని ఇళ్లను ముంచెస్తోంది.

అనంతపురం పట్టణం చుట్టుపక్కల చెరువుల నుంచి వరద పెద్ద ఎత్తున నడిమి వంకలోకి చేరడంతో నగరంలోని 18 కాలనీలు నీటమునిగాయి. లక్ష్మీనగర్, ఆజాద్ నగర్, నాలుగో రోడ్డు, ఐదో రోడ్డు, రంగస్వామి నగర్, సోమనాథ్ నగర్, శాంతినగర్, భగత్ సింగ్ నగర్, రజకనగర్, రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబు కొట్టాల, చైతన్య కాలనీ, సీపీఐ కాలనీ, పంతుల కాలనీ, విశ్వశాంతి నగర్, కక్కలపల్లి పంచాయతీ పరిధిలోని జాకీర్ కొట్టాలు, సుందరయ్య కాలనీలు జలమయం అయ్యాయి.

ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని అనేక ఇళ్లు నీట మునిగాయి. ఇంట్లోని సామానంతా వరద నీటిలో కొట్టుకుపోయింది. చాలా ఇళ్లలో బియ్యం, బట్టలు తడిసిపోయాయి. రాత్రి నుంచి వరద ప్రవాహం పెరగడంతో కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో చిన్న, పెద్ద అంతా అల్లాడుతున్నారు.

చాలా ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. కళ్ల ముందే అంతా నీటి పాలు కావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. రాత్రంతా అంధకారంలోనే మగ్గిపోయారు.

రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. రబ్బర్ పడవుల సాయంతో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు సైతం రంగంలోకి దిగారు. వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలను కాపాడారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు.