విశాఖపట్నంలో వర్ష బీభత్సం.. ప్రమాదం అంచున నివాసాలు, భయాందోళనలో ప్రజలు

అప్రమత్తమైన అధికారులు.. నివాసితులను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Visakhapatnam Rains : విశాఖపట్నంలో వర్షం దంచికొట్టింది. గోపాలపట్నంలో వర్ష బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ ప్రాంతంలోని పలు నివాసాలు ప్రమాదం అంచులో ఉన్నాయి. ఏ క్షణాన కూలిపోతాయో అన్న భయాందోళనలో స్థానికులు ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు నివాసితులను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా గ్యాప్ లేకుండా వర్షం దంచికొడుతోంది. గోపాలపట్నం దగ్గర ఖాళీ మాత టెంపుల్ ప్రాంతంలో ఉన్న కొండవాలు ప్రాంతంలో కొండ చరియలు జారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితుల్లో అక్కడి ఇళ్లు ఉన్నాయి.

పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సైతం ఆ ఇళ్లను పరిశీలించారు. వెంటనే అధికారులను సైతం అలర్ట్ చేశారు. అక్కడున్న వారందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విజయవాడలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో అధికారులు అలర్ట్ అయ్యారు. కొండచరియలు విరిగిపడితే ప్రమాదం ఉండటంతో అక్కడ భవనాల్లో నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు.

 

Also Read : ఏపీకి భారీ వర్ష సూచన.. ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

ట్రెండింగ్ వార్తలు