ఢిల్లీ వెళ్లి మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి- జగన్‌పై మంత్రి అనిత ఫైర్

జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.

Home minister Anitha Vangalapudi

Anitha Vangalapudi : ఏపీలో రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరం అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని.. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రులకు తరలించామని వివరించారు. సహాయ చర్యల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను మంత్రి అనిత కొట్టిపడేశారు.

ప్రమాదం రోజు విజయవాడ నుండి తాను రోడ్డు మార్గంలో ఘటనా స్థలానికి రాత్రి 12.30 కు చేరుకున్నానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులను పరామర్శించారని చెప్పారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారని, తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. సీఎం ప్రకటించిన 24 గంటల గడవక ముందే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందజేశామన్నారు హోంమంత్రి అనిత.

”జగన్ ధర్నా చేయాలంటే చాలా ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడికి పిలిపించుకున్నారు? ఎల్జీ పాలిమర్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారా? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 15 మంది మృతి చెందితే 12 మందికే ఎక్స్ గ్రేషియా ఇచ్చారు. ముగ్గురికి ఇప్పటికీ ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు. పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు, ప్రభుత్వం స్పందించడం లేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంకటాపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఇప్పటికీ హాస్పిటల్ లేదు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.

ధర్నా చేయాలంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయండి. మీ బాబాయ్ కేసు కోసం ధర్నా చేయండి. మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేస్తున్న పనులు కోసం ధర్నా చేయండి. గత ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి ఒక్కసారైనా అధికారులతో సమావేశం నిర్వహించారా? పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, పరిశ్రమ మూసివేస్తాం అని హెచ్చరించాం. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, కఠిన చర్యలు ఉంటాయి” అని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత.

 

ట్రెండింగ్ వార్తలు