కర్నూలు జిల్లాలో పరువు హత్య.. నడిరోడ్డుపై దారుణంగా చంపేశారు

కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. తన తల్లిదండ్రులే తన భార్తను హత్య చేశారంటూ బాధితుడి భార్య ఆరోపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదోనీ పట్టనంలోని కిష్టప్పనగర్‌కు చెందిన ఆడమ్‌ స్మిత్‌ అనే వ్యక్తిని దుండగులు బండరాయితో కొట్టి చంపేశారు. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన ఆడమ్‌స్మిత్‌ ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన మళ్లీశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరుపు కుటుంబం అప్పటి నుంచి వీరిద్దరిపై ఆగ్రహంతో ఉంది.

వివాహం అనంతరం నూతన దంపతులిద్దరూ కిష్టప్పనగర్‌లోనే ఉంటుండగా.. గురువారం(31 డిసెంబర్ 2020) ఆడం స్మిత్ తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆర్టీసీ కాలనీ వద్ద నడిరోడ్డుపైనే దుండగులు అతనిని ఇనుపరాడ్లతో కొట్టి, బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ప్రేమ పెళ్లి ఇష్టంలేని తన తల్లిదండ్రులే తన భర్తను హత్య చేయించారని ఆడం స్మిత్ భార్య ఆరోపిస్తోంది.