టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ

ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడం... ఇద్దరు కూడా దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తుండటం వల్ల ఆ ఇద్దరికీ ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నిష్క్రమణతో వచ్చిన ఈ కొత్త చిక్కును ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి వుంది.

Guntur MP Ticket War In TDP

TDP Guntur MP Ticket : టీడీపీలో గుంటూరు ఎంపీ సీటుపై ఇద్దరు నేతల మధ్య పోటీ ఎక్కువైంది. పార్టీ కచ్చితంగా గెలుస్తుందని లెక్కలేసుకుంటున్న ఆ స్థానాన్ని పార్టీకి ఆర్థికంగా అండదండగా నిలిచిన ఇద్దరు ప్రముఖులు ఆశిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం. ఇద్దరూ రెండు మూడు దఫాలుగా టీడీపీ సీటును ఆశించి దక్కించుకోలేకపోయిన వారే.. చివరి వరకు వారికి టికెట్‌ ఇస్తామని చెప్పి.. లాస్ట్‌ మినిట్‌లో రేసు నుంచి తప్పించింది టీడీపీ. ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుందా? లేక కష్టకాలంలో ఆదుకున్నారనే కారణంతో అందలం ఎక్కిస్తుందా? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు టికెట్ కోసం తీవ్ర పోటీ..
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పక్కాగా గెలుస్తుందని ఆ పార్టీ క్యాడర్‌ లెక్కలేసుకుంటున్న నియోజకవర్గాలు గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలు. ఈ రెండు స్థానాలకు టీడీపీలో ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టికెట్లు ఆశించారు. అయితే ఆకస్మాత్తుగా ఇందులో నరసారావుపేట సీటును సిట్టింగ్‌ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తన్నుకుపోవడంతో.. ఇద్దరి మధ్య గుంటూరు సీటు కోసం పోటీ ఏర్పడింది.

ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ అధిష్టానం..
వైసీపీ నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు రాకపోతే.. ఇద్దరూ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఇద్దరూ ఒకటేసీటు కోసం గట్టిపట్టు బడుతున్నారు. ఇద్దరూ టీడీపీకి ఆర్థికంగా అండదండలు అందించిన వారే కావడంతో ఎవరికి ఓకే చేయాలో తేల్చేకోలేకపోతోంది టీడీపీ అధిష్టానం.

Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్‌ ఎంపీలకూ టికెట్లు..!

ఈజీగా గెలుస్తామని నమ్మకం..
టీడీపీ ప్రభుత్వం వస్తే గుంటూరు ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో ఈ సీటు కోసం పోటీ తీవ్రంగా ఉంది. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని మంగళగిరి, పొన్నూరు సీట్ల నుంచి నారా లోకేశ్‌, ధూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తుండటం.. వారి ప్రభావం ఎంపీ సీటుపై ఉండే అవకాశం ఉండటంతో గుంటూరులో పెద్దగా కష్టపడకుండా గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు టీడీపీ నాయకులు. ఈ కారణంతోనే ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని, భాష్యం రామకృష్ణ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

పెమ్మసానికి న్యాయం చేస్తారా?
వాస్తవానికి ఎన్‌ఆర్‌ఐ పెస్మసాని చంద్రశేఖర్‌ 2014 నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2014లో నరసారావుపేట సీటు ఆశిస్తే.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రూపంలో ఆయన ఆశలు నీరుగారిపోయాయి. ఇక 2019లో సిట్టింగ్‌ ఎంపీగా మరోసారి రాయపాటికే సీటు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం కచ్చితంగా అవకాశం దక్కుతుందనుకుంటే.. మళ్లీ సిట్టింగ్‌ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు రూపంలో పెమ్మసాని ఆశలకు గండిపడింది.

వరుసగా నిరాశే ఎదురవుతుండటంతో ఈసారి ప్లాన్‌ మార్చి గుంటూరుపై కర్చీఫ్ వేయాలని నిర్ణయించారు పెమ్మసాని. ఆలస్యం చేస్తే మళ్లీ టికెట్‌ చేజారిపోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో హుటాహుటిన అమెరికా నుంచి వచ్చేశారు పెమ్మసాని. పార్టీకి ఆర్థిక అండదండలు అందించిన ఆయనకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

Also Read : ఉత్తరాంధ్రలో ఈసారి ఎగిరే జెండా ఏది? ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

ఈసారి నాకే ఇవ్వాలంటున్న భాష్యం రామకృష్ణ..
ఇక ఇదే సీటును ఆశిస్తున్న భాష్యం రామకృష్ణపైనా టీడీపీ నేతల్లోనూ.. అధిష్టానంలోనూ సానుకూల దృక్పథం కనిపిస్తోంది. పార్టీతో దశాబ్దకాలంగా అనుబంధం కొనసాగిస్తున్న రామకృష్ణ ప్రతి ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులకు తనవంతు సహాయం చేసేవారని చెబుతున్నారు. భాష్యం విద్యాసంస్థల హెడ్ క్వార్టర్స్ కూడా గుంటూరు నగరంలోనే ఉండటం.. విద్యార్థుల తల్లిదండ్రులతో విస్తృత పరిచయాల వల్ల రామకృష్ణకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనా వేస్తోంది టీడీపీ. 2019 ఎన్నికల్లో నరసరావుపేట సీటు రామకృష్ణకు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. కానీ, సిట్టింగ్ ఎంపీ రాయపాటి మళ్లీ పోటీ చేయడంతో రామకృష్ణకు అవకాశం దక్కలేదు. ఈసారి గుంటూరు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు భాష్యం రామకృష్ణ.

ఇద్దరూ గట్టి అభ్యర్థులే కావడం… ఇద్దరు కూడా దశాబ్దాలుగా పార్టీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తుండటం వల్ల ఆ ఇద్దరికీ ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలేకపోతోంది టీడీపీ.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ నిష్క్రమణతో వచ్చిన ఈ కొత్త చిక్కును ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి వుంది.

 

ట్రెండింగ్ వార్తలు