Srisailam Traffic Jam : శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి ముఖద్వారం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వరుసగా సెలవులు రావడంతో పాటు రేపు చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి అభిషేకాలు రద్దు చేశారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 5 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో వెలసిన స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కాగా, వరుసగా సెలవులు రావడంతో నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అదే విధంగా కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు భారీ ఎత్తున వచ్చారు. పాతాళ గంగ నుంచి హైదరాబాద్ రోడ్ వరకు దాదాపు 5 కిలోమీటర్లకుపైనే ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ప్రతి ఏటా ఈ మాసంలో శ్రీశైలంకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోందని భక్తులు మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు వస్తుంటారు. కార్తీక మాసం అంటేనే మల్లన్నకి అత్యంత ఇష్టమైన మాసం. దీంతో ఈ మాసంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే, ట్రాఫిక్ ను నిలువరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు.
ట్రాఫిక్ ను నిలువరించేందుకు పోలీసులు లేకపోవడం, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం.. ట్రాఫిక్ జామ్ కు కారణం అవుతోందని భక్తులు చెబుతున్నారు. పాతాళ గంగ, ఈగల పెంట, దోమల పెంట ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో తమ వాహనాల్లో వస్తుంటారు. ఈ క్రమంలో కచ్చితంగా ట్రాఫిక్ ను నిలువరించాల్సి ఉంది. అయితే, అధికార యంత్రాంగం అదేమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏటా మహా శివరాత్రి సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసినా.. అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతోంది. ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని భక్తుల వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని, మరోసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాలా రూ.6,500 కోట్లు: నారా లోకేశ్