Husband commits suicide : చెప్పా పెట్టకుండా భార్య బంధువుల ఇంటికి వెళ్లటం…. ఆమె చెప్పులు గోదావరి నది ఒడ్డున దొరకటంతో ఆందోళన చెందిన భర్త, భార్య కోసం గోదావరి లో దూకి ప్రాణాలు వదిలాడు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలో యర్రంశెట్టి వెంకట రవికుమార్(28)అనే యువకుడు తాపీ పని చేసుకుంటూ భార్య పుష్పశివతో కలిసి జీవిస్తున్నాడు. భార్యా భర్తలిద్దరూ ఆదివారం రాత్రి 11 గంటలవరకు టీవీ చూశారు. రాత్రి వారిద్దరి మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ తెల్లావారి లేచి చూసేసరికి రవికుమార్ భార్య ఇంట్లో కనిపించలేదు.
ఆమె మెడలో ఉండాల్సిన మంగళ సూత్రంఇంట్లో ఉంది. భార్య ఎక్కడికి వెళ్లిందా అనే ఆదుర్దాలో ఆమెను వెతుకుతూ వెళ్లిన రవికుమార్ కు ఆమె చెప్పులు గోదావరి నది ఒడ్డున దొరికాయి. ఆ చెప్పులు తీసుకుని ఇంటికి వచ్చాడు. తల్లికి ఆ చెప్పులు చూపించి అవి తన భార్యవేనని నిర్ధారించుకున్నాడు. భార్య గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించాడు. వెంటనే బైక్ తీసుకుని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. బైక్ అక్కడ స్టాండ్ వేసి గోదావరిలో దూకేశాడు. స్ధానికంగా చేపలు పడుతున్నమత్స్యకారులు ఇది గమనించి రక్షించాలని చూసినా అతను లభ్యంకాలేదు.
కాగా పుష్పశివ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాలకొల్లులోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆమె ఎక్కడకు వెళ్ళిందనే సరైన సమాచారం లేకపోవటం…. ఆమె చెప్పులు గోదావరి నది ఒడ్డున దొరకటంతో.. భర్త ఆందోళన చెంది గోదావరిలో దూకేశాడు. పుష్పశివ గతంలో కూడా ఇలానే చెప్పా పెట్టకుండా ఆదృశ్యమై బంధువుల ఇంట ప్రత్యక్షమైందని స్ధానికులు తెలిపారు.
వెంకట రవికుమార్, పుష్పశివలకు మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. జనవరి 20న తిరుపతి వెళ్లి బాబుకు పుట్టు వెంట్రుకలు తీయించటానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఇంతలో ఇలా జరగటం ఆఇంట విషాదాన్ని నింపింది. రాజోలు ఎస్సై ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు. గోదావరిలో దూకి గల్లంతైన రవికుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.