Ayyanna Patrudu: ప్రభుత్వ ఉద్యోగి విధులకు రాకుంటే సస్పెన్షన్.. ఇది ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదు? స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు..
ఏడాదిలో కనీసం 60 రోజులు సభ నడిపేలా నిబంధలు ఉండాలన్నారు. దీనిపై లోక్ సభ నిర్ణయం తీసుకోవాలన్నారు.

Ayyanna Patrudu: తిరుపతి జాతీయ మహిళా సాధికార సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారాయన. చిరుద్యోగులకు సైతం నో వర్క్ – నో పే ఉందని, మరి ఎమ్మెల్యే కు ఇది ఎందుకు వర్తించదని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
చాలామంది ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం లేదన్నారు. బయట మాట్లాడే బదులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అని హితవు పలికారు. విధులకు రాకుంటే ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నారు.. ఇది ఎమ్మెల్యేలకు వర్తించదా? అని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ బాధ్యతగా ఎమ్మెల్యేలు పని చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సభకు రాకుంటే ఏం చేయాలో లోక్ సభ స్పీకర్ ఆలోచన చేయాలన్నారు. ఏడాదిలో కనీసం 60 రోజులు సభ నడిపేలా నిబంధలు ఉండాలన్నారు. దీనిపై లోక్ సభ నిర్ణయం తీసుకోవాలన్నారు.
”చిరుద్యోగులకు సైతం నో వర్క్, నో పే వర్తిస్తుంది. మరి మన ఎమ్మెల్యేలకు అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా రావడం లేదు. ప్రజలు ఎన్నుకుని మా సమస్యలు పరిష్కారం చేయండని ఓట్లు వేస్తే.. అసెంబ్లీ రావడం లేదు ఎందుకు? ఎక్కడో బయట మాట్లాడే బదులు సభలో మాట్లాడొచ్చు కదా. మీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు కదా. ఎందుకు తేవడం లేదు.
లోక్ సభ స్పీకర్ దీన్ని పరిశీలించాలని నా మనవి. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు రాకపోతే సస్పెండ్ చేస్తారు. ఇది ఎమ్మెల్యేలు ఎందుకు వర్తించదు? ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చేయాలి అన్నది స్పీకర్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులకంటే ఉన్నత ప్రమాణాలు నడుచుకోవాలి. దేశంలోని అన్ని అసెంబ్లీలకు లోక్ సభ స్పీకర్ సూచనలు ఇవ్వాలి. కనీసం ఏడాదిలో 60 రోజులు సభ నడిచేలా ఆదేశాలు ఇవ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ 30 రోజులో, 40 రోజులో నడుస్తోంది. ఇది చాలా బాధాకరం” అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
Also Read: ఏపీ రాజధాని అమరావతి.. వైసీపీ స్టాండ్ మార్చుకుందా? ఇప్పుడున్న నిర్ణయమే ఫైనలా?