అనుమానం పెను భూతం..అది ఒక్కసారి మనస్సులోకి వచ్చిందంటే విషవృక్షమై జీవితాలను కాల్చేస్తుంది. అర్థం లేని అనుమానాలు..జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. పచ్చని కాపురాలను కూల్చేస్తున్నాయి. ఏరోగానికైనా మందు ఉంటుందేమో గానీ..అనుమానం అనే రోగానికి మందు ఉండదు. ఈరోగం వస్తే వాడైనా చావాలి..లేదా తను అనుమానం పడే వ్యక్తినైనా చంపాలి.. అదే జరిగింది ఏపీలోని చిత్తూరు జిల్లాలో. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేసి రెండు కాళ్ళు నరికేశాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఈ అమానవీయమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే..శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ కి ఆరు నెలల క్రితం నెల్లూరుకు చెందిన దుర్గతో వివాహం అయింది. పెళ్ళైన తొలినాళ్లలో వెంకటేష్ ఆమెతో బాగానే ఉండేవాడు. కానీ అనుమానం అనే పెద్ద మాయ రోగం వెంకటేశ్ లో ప్రవేశించింది. అది మొక్కై..మానై విషవృక్షంగా మారింది. ఎవరితోనే ఆమెకు సంబంధం ఉందని పదే పదే ఊహించుకుంటూ ..పెళ్లి అయిన కేవలం ఆరు నెలలకే భార్యకు నరకం అంటే ఏంటో చూపించాడు.
భర్త అనుమానపు మాటలతో చేష్టలతో క్షణమొక యుగంలా నరకయాతన అనుభవించేది దుర్గ. నాకే పాపం తెలీదు..నన్ను నమ్ము అని ఎంతగా వేడుకున్నా..ఆ అనుమానపు పశువుకి తలకు ఎక్కేది కాదు..దీంతో ఇల్లు నరకంలా మారింది. సూటిపోటి మాటలతో భర్త వేధింపులకు ఏడవటం తప్ప ఏం చేయాలో ఆమెకు తెలిసేది కాదు. ఎవరితోనైనా చెప్పుకుందామంటే పరువు తక్కువ. దీంతో భర్తతో గొడవలు తప్పేవి కాదు..
అలా ఇద్దరి మధ్యా ప్రతీరోజూ గొడవలు సర్వసాధారణం అయిపోయేవి. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 26,2020) రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తితో ఆమె కాళ్ళు నరికేశాడు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడిగట్టాడు. తరువాత వెళ్లి శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న దుర్గను స్థానికులు నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.